ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్ : మతిస్థితిమితం లేని యువతిపై దుండగుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని గోగులమూడిలో గురువారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాధిత యువతి కొద్దిరోజుల కిందట గేదెలను మేపడానికి వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన కారంపూడి లచ్చం సుబ్బారావు అనే వివాహితుడూ గేదెలను మేపడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆమెపై లైంగిక దాడి చేశాడు. యువతి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి తల్లి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ అబ్దుల్ రెహమాన్ కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు పరారిలో ఉన్నట్లు తెలిపారు. ప్రత్తిపాడు సిఐ వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










