ప్రజాశక్తి - గుంటూరు : నగరపాలక సంస్థ పరిధిలోని ఏటి అగ్రహారం 2వ లైన్‌లో సమీప ప్రాంతానికి సంబంధించిన ఫాతిమా నగర్ సూచిక బోర్డును పట్టణ ప్రణాళిక విభాగం, కిందిస్థాయి సిబ్బంది అవగాహన లోపంతో చేసిన పొరపాటును మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నగర పాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. నగరంలో ఏటి అగ్రహారం, శ్రీరాంనగర్ పేర్లను మార్చుతున్నట్లు గురువారం సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని కోరారు. ప్రశాంతమైన గుంటూరు నగరంలో మత విద్వేషాలను రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో భాగంగా ప్రధాన వీధులకు జిఎంసి సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తుందని, ఏటి అగ్రహారం 2వ లైన్ పక్కనే ఫాతిమా నగర్ ఉన్నదని, అటువైపు పెట్టాల్సిన ఆ ప్రాంత సూచిక బోర్డును ఏ.టి అగ్రహారం 2వ లైన్‌లో ఏర్పాటు చేయడంతో అగ్రహారం పేరు మారుస్తున్నారనే అపోహకు ప్రజలు గురయ్యా రని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన నగర కమిషనర్ వెంటనే బోర్డు తొలగించటంతోపాటు, ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అదే ప్రాంతంలో ఏటి అగ్రహారం సూచిక బోర్డును శుక్రవారం సాయంత్రంలోపు ఏర్పాటు చేయా లని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించా మని తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కూడా స్పందించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలి కారని పేర్కొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగోట్టేవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటనలో స్పష్టం చేశారు.










