Sep 25,2021 06:08

ముస్లిమేతరులను నాశనం చేయడానికి జిహాదీలు మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్నారని బిషప్‌ పేర్కొన్నారు. ఇంత దారుణమైన ఆరోపణ సహజంగానే కేరళ సమాజంలో ఆందోళనను, అపోహలను రేకెత్తించింది. రాజకీయ చట్రంలో జిహాదీల కుట్రను తోసిపుచ్చినప్పటికీ, బిషప్‌ వైఖరిని సమర్ధించడానికి బిజెపి ముందుకొచ్చింది. జిహాదీల కార్యకలాపాలపై చట్టాన్ని తేవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ముస్లింలు, క్రైస్తవుల మధ్య అగాధం సృష్టించడానికి, ఇస్లామోఫోబియా (ముస్లింల పట్ల విద్వేషాన్ని)ను రెచ్చగొట్టడానికి బిజెపికి మంచి అవకాశం దొరికింది.
    కేరళకు ఒక విశిష్టమైన సామాజిక కూర్పు వుంది. జనాభాలో ముస్లింలు, క్రైస్తవులు కలిసి 45 శాతంగా వుంటారు. కేరళ సమాజంలో మూడు మతాల వారు పరస్పరం కలిసిపోయి, సామరస్యంగా కలిసి మెలిసి జీవనం సాగిస్తుంటారు. ఈ మూడు ప్రధాన మతాల వారికీ మలయాళీ గుర్తింపు అనేది ఒకే రకమైన సామాజిక, సాంస్కృతిక లక్షణాలతో కూడినది.
ఇలా వివిధ మతాల కలయికకు రాజకీయాల్లో బలమైన లౌకిక సాంప్రదాయం తోడైంది. ఈ తరహా రాజకీయాలకు వామపక్షాలు గణనీయంగా దోహదపడ్డాయి.
     ఇటీవలి సంవత్సరాల్లో, బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా జరిగే హిందూత్వ దాడులు ఈ సామరస్య పూర్వక సహజీవనానికి, వారి పరస్పర కార్యాచరణకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేథలిక్‌ చర్చిలో భాగమైన సిరో-మలబార్‌ చర్చి బిషప్‌ ఆఫ్‌ పాలా జోసెఫ్‌ కల్లారంగట్‌ చేసిన ప్రసంగాన్ని మనం పరిశీలించాల్సి వుంది. కొట్టాయం జిల్లా లోని చర్చిలో ఆయన ఈ ప్రసంగం చేశారు. ముస్లిం తీవ్రవాద శక్తులు నిర్వహిస్తున్న ''లవ్‌ జిహాద్‌, నార్కొటిక్‌ జిహాద్‌''ల గురించి ఆయన హెచ్చరించారు. ఈ 'లవ్‌ జిహాద్‌'ను కేథలిక్‌ చర్చి గతంలో లేవనెత్తింది కానీ 'నార్కొటిక్‌ జిహాద్‌' ముప్పు గురించి మాట్లాడడం కొత్త.
    ముస్లిమేతరులను నాశనం చేయడానికి జిహాదీలు మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్నారని బిషప్‌ పేర్కొన్నారు. ఇంత దారుణమైన ఆరోపణ సహజంగానే కేరళ సమాజంలో ఆందోళనను, అపోహలను రేకెత్తించింది.
    దేశంలో ఇతర ప్రాంతాల్లో వున్నట్లుగానే కేరళలో కూడా మాదకద్రవ్యాల మాఫియాలు, నెట్‌వర్క్‌లు వున్నాయి. కానీ, వీటిని మతపరమైన ఏ తీవ్రవాద గ్రూపునకైనా ఆపాదించడం పూర్తిగా పొరపాటు అవుతుంది. ఇటువంటి సంబంధాలు వున్నాయన డానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ''ఏ మతమూ కూడా ఇటువంటి మాదకద్రవ్యాలను ప్రోత్సహించదు. ఇది సంఘ వ్యతిరేకం'' అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ''సామాజిక రుగ్మతలకు మతం రంగు పులమరాద''ని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
    రాజకీయ చట్రంలో జిహాదీల కుట్రను తోసిపుచ్చినప్పటికీ, బిషప్‌ వైఖరిని సమర్ధించడానికి బిజెపి ముందుకొచ్చింది. జిహాదీల కార్యకలాపాలపై చట్టాన్ని తేవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ముస్లింలు, క్రైస్తవుల మధ్య అగాధం సృష్టించడానికి, ఇస్లామోఫోబియా (ముస్లింల పట్ల విద్వేషాన్ని)ను రెచ్చగొట్టడానికి బిజెపికి మంచి అవకాశం దొరికింది.
లవ్‌ జిహాద్‌కు సంబంధించినంత వరకు, కేరళలో కొన్నేళ్ళ క్రితం 21 మంది వ్యక్తులు ఇళ్ళను, కుటుంబాలను వీడి తీవ్రవాద సంస్థ అయిన ఐసిస్‌-ఖొర్సాన్‌లో చేరేందుకు ఆఫ్ఘనిస్తాన్‌కు పారిపోయిన సంఘటన కలవర పరుస్తుంది. వారిలో ఇద్దరు క్రైస్తవ మహిళలు వున్నారు. వారు ఇస్లామ్‌కు మారిపోయి, తమ భర్తలను ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్ళేలా ప్రోత్సహించారు. వారిలో ఒకరు వాస్తవానికి క్రిస్టియన్‌ వ్యక్తినే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఇస్లాం లోకి మారిపోయారు. ఈ వ్యక్తులను రిక్రూట్‌ చేసుకోవడం, వారిలో తీవ్రవాద భావజాలాన్ని చొప్పించడం వెనుక జిహాదీ నెట్‌వర్క్‌ వుంది.
ఈ ఇద్దరు మహిళలు ఇస్లాం మతంలోకి మారడం, తీవ్రవాదం పట్ల ప్రభావితులు కావడంపై కేథలిక్‌ చర్చి ఆందోళనను అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి తీవ్రవాద ప్రభావాల ఉచ్చులో పడకుండా తమ వారిని హెచ్చరించడం కూడా సరైనదే. అయితే, ఇలాంటివి అక్కడక్కడా అప్పుడప్పుడూ జరిగే సంఘటనలు. ముస్లిమ్‌ యేతర మహిళలను ప్రలోభపరుచుకోవడానికి 'లవ్‌ జిహాద్‌' వంటి పకడ్బందీ పథకాలేవీ జరిగినట్లుగా ఎన్‌ఐఎ, రాష్ట్ర పోలీసుల దర్యాప్తుల్లో తేలలేదు.
వివిధ మత, కుల సంఘాల నాయకులు 'మన మహిళలు', 'మన బాలికలు' అంటూ మాట్లాడడం, మహిళలపై వారికి గల పితృస్వామ్య వ్యవస్థ, యాజమాన్య హక్కులను పునరుద్ఘాటించడం లవ్‌ జిహాద్‌పై జరిగే మొత్తం చర్చలో కలవరపెట్టే మరో అంశం. మహిళలకు వారికంటూ స్వంత అభిప్రాయాలు వుంటాయని, ప్రేమ, వివాహం వంటి విషయాల్లో వారికంటూ ఇష్టాలు వుంటాయనేది తిరస్కరిస్తున్నారు.
బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి ముస్లింలపై కేంద్రీకరిస్తోంది. చాలా పకడ్బందీగా క్రైస్తవ మతాధికారులను తమ వైపునకు లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని మోడీ కేరళలో పలు క్రైస్తవ చర్చిల నాయకులతో భేటీ అయ్యారు.
కేరళలో క్రైస్తవుల్లో కేేథలిక్కులు పెద్ద సంఖ్యలో వున్నారు. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ అసలైన స్వభావం వారికి తెలిసి వుండాలి. మైనారిటీలు ముస్లిమ్‌లైనా, క్రైస్తవులైనా వారికి వ్యతిరేకంగా హిందూత్వ శక్తులు అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. 2016 నుండి 2019 మధ్య కాలంలో 'పర్‌సెక్యూషన్‌ రిలీఫ్‌' నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా క్రైస్తవులపై 1774 విద్వేష నేరాలు నమోదయ్యాయి. 2016 నుండి క్రిస్టియన్లపై జరిగిన విద్వేష నేరాలు 59.6 శాతం ఎక్కువయ్యాయి.
మత విభజనను సృష్టించడానికి బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ నిరంతరంగా ప్రయత్నిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలు సెప్టెంబరు 25ను 'మలబార్‌ హిందూ మారణకాండ దినం'గా పాటిస్తున్నాయి. 1921లో మలబార్‌ తిరుగుబాటుకు వారి వక్రీకరణ రూపమే ఇది. బ్రిటీష్‌ పాలనకు, ముస్లిం రైతాంగాన్ని అణచివేతకు గురి చేసిన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మలబార్‌ తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు అసలు స్వభావం అది. అయితే తిరుగుబాటు చివరి దశలో హిందువులపై కూడా కొన్ని దాడులు చోటు చేసుకున్నాయి. బ్రిటీష్‌ సాయుధ బలగాలు దారుణంగా అణచివేసిన తర్వాత ఈ తిరుగుబాటు ఆరంభమైంది.
కేరళలో క్రైస్తవుల పట్ల కొత్తగా సానుభూతి చూపడం ఆరంభించిన ఆర్‌ఎస్‌ఎస్‌...మలబార్‌ తిరుగుబాటును హిందూ వ్యతిరేకిగానే కాకుండా క్రైస్తవ వ్యతిరేకంగా కూడా చూపించాలని భావిస్తోంది.
కేథలిక్కులు, ఇతర వర్గాలకు చెందిన వారు, సామాన్యులు ఇస్లామోఫోబియా ప్రమాదాల గురించి, హిందూత్వ శక్తులు ఆడుతున్న విచ్ఛిన్నకర క్రీడ గురించి మాట్లాడడం విచారకరం. మైనారిటీ కమ్యూనిటీల మధ్య విభజనను రెచ్చగొట్టేందుకు సంఘ పరివార్‌ అనుసరించే దుష్ట ఎత్తుగడల్లో చర్చి నాయకులు చిక్కుకునే అవకాశాల గురించి హెచ్చరించిన వారిలో త్రిస్సూర్‌ మెట్రోపాలిటన్‌ చర్చికి చెందిన యోహనన్‌ మార్‌ మెలిషస్‌ వున్నారు.
మెజారిటీ మతోన్మాదమైన హిందూత్వ వల్ల ఎదురయ్యే ప్రమాదం గురించి కేరళలో సిపిఎం కు స్పష్టమైన అవగాహన వుంది. రాజకీయంగా, సైద్ధాంతికంగా బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ను ఎదుర్కొనేందుకు లౌకికవాద, ప్రజాస్వామ్య శక్తులన్నిటిని కూడగట్టాలని భావిస్తోంది. ముస్లిం తీవ్రవాద సంస్థలు, తీవ్రవాద భావజాలాలు విసిరే ముప్పు గురించి కూడా పార్టీకి తెలుసు. వాటిలో కొన్ని విదేశాల్లోని ముస్లిం తీవ్రవాద ఉత్పత్తులే.
ఇక క్రైస్తవుల విషయానికొస్తే, తీవ్రవాద ధోరణులు చెదురుమదురుగా పొడచూపాయి. మతతత్వం పెరిగిపోతున్న వాతావరణంలో, సమాజంలో సామాజిక-ఆర్థిక సమస్యల నుండి తలెత్తిన అభద్రతలు పెరుగుతున్న తరుణంలో లౌకికవాద పొందికను తుడిచిపెట్టడానికి...మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి నిరంతరాయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుత బిషప్‌ ప్రసంగానికి సోషల్‌ మీడియాలో వివిధ రకాలైన స్పందనలు, ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో అత్యంత సున్నితమైన, మతపరంగా రెచ్చగొట్టే సమాచారాన్ని కట్టడి చేసేందుకు రంగం లోకి దిగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి వుంది. సమాజంలోని ప్రగతిశీల వర్గాలన్నిటి సహకారంతో అన్ని రంగాల్లో మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కొనాల్సిన, మత సామరస్యతను పరిరక్షించాల్సిన ప్రధాన కర్తవ్యం వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులపై వుంది.
 

/'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం/