Oct 25,2023 20:51

ఉరుసు ఉత్సవాల బ్యానర్‌ను ఆవిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్‌, దర్గా పెద్దలు

కడప అర్బన్‌ : అమీన్‌పీర్‌ దర్గా ఉరుసు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా మతసామరస్యంతో కలిసికట్టుగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా, కలెక్టర్‌ వి.విజరు రామరాజు పిలుపునిచ్చారు. నవం బర్‌ నెల 25వ తేదీ నుండి నుండి డిసెంబర్‌ 1వ తేదీ వరకు జరుగనున్న ఉత్స వాలకు సంబంధించి బుధవారం స్థానిక అమీన్‌పీర్‌ దర్గాలోని ముషాయిరా హాల్‌లో ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై పీఠాధిపతి జనాబ్‌ ఆరిఫ్‌ ఉల్లా హుసేని అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అంజాద్‌ బాషా మాట్లాడుతూ శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ప్రఖ్యాత అమీన్‌పీర్‌ దర్గా ఉత్సవాలను మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. ముందస్తు ప్రణాళికతో కలెక్టర్‌ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. దర్గా కమిటీ సభ్యులు, జిల్లా యంత్రాంగం అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్‌ వి.విజరు రామరాజు మాట్లాడుతూ మన కడపలో మన పండుగగా భావించే కడప అమీన్‌పీర్‌ దర్గా ఉత్సవాలను అందరూ కలసి కట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరారు. మళ్ళీ ఉరుసు మహో త్సవాలకు కొన్ని రోజుల ముందుగానే అన్నిరకాల ఉత్సవ ఏర్పాట్లను ఒక్కొశాఖ జిల్లా అధికారుల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా గట్టి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం కడప నగరంలో పలు రకాలైన అభివద్ధి పనులు జరుగుతున్నందున ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులైన అధికారులకు సూచించారు. ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌ మాట్లాడుతూ అమీన్‌పీర్‌ దర్గా ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్దేశించిన ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉరుసు నిర్వహణా ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం నుండి చేపట్టాల్సిన కార్యక్రమాలపై తయారు చేసిన ఎస్‌ఒపిని పీఠాధిపతుల వారికి కలెక్టర్‌ సమర్పించారు. అనంతరం ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎస్‌.బి.అంజాద్‌ బాషా, కలెక్టర్‌ విజరు రామరాజు, ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉరుసు మహోత్సవ బ్యానర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెసి జి.గణేష్‌ కుమార్‌, నగర కమిషనర్‌ సూర్య సాయిప్రవీణ్‌ చంద్‌, శిక్షణ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌, ఆర్‌డిఒ ధర్మచంద్రారెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూష, నగర కార్పొరేటర్లు, దర్గా కమిటీ సభ్యులు గోవర్ధన్‌ రెడ్డి, హరిప్రసాద్‌, అమీర్‌బాబు, సుభాన్‌ బాషా, అహ్మద్‌ బాషా, రాష్ట్ర వేర్‌ హౌస్‌ డెవెలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కరీముల్లా, కడప మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నాగయ్య, ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.