May 18,2022 06:49

ముందు తరం పాలకులు ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ వచ్చినందువల్ల కాదా? వీరికిప్పుడు అధికారం దక్కిందీ? పక్క దేశం పాటించిన తప్పుడు విధానాల్ని గమనించి, మనం వాటిని పాటించకుండా జాగ్రత్త పడాలి. మతానికి ప్రాముఖ్యమిచ్చే వారు ఎక్కడైనా, ఎప్పుడైనా మట్టి కొట్టుకు పోవాల్సిందే ! మనిషిని మనిషిగా గుర్తించనంత కాలం ప్రగతి సాధ్యం కాదు. దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో? మత రాజ్యంగా మారితే ఎలా ఉంటుందో మనం పక్కనున్న పాకిస్తాన్‌ను చూసి నేర్చుకోవచ్చు. మత సామ్రాజ్యాల ప్రాధాన్యతలెప్పుడూ మనిషిని మనిషిగా ఎదగనివ్వవు.

    పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అవిశ్వాసంతో దిగిపొయ్యాడు. అంతకు ముందు సైన్యాధ్యక్షుడు ముషరఫ్‌ దుర్మార్గంగా ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను దించేశాడు. తర్వాత బెనజీర్‌ భుట్టోను చంపేశారు. ఇస్లాం మత రాజ్యమైన పాకిస్తాన్‌లో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కొంత కాలం ఉంటే, మిలటరీ అధికారం మరికొంత కాలముంటుంది. స్వాతంత్య్రం లభించి డెబ్బయి అయిదేళ్ళు పూర్తి కావస్తున్నా, స్థిరమైన ప్రభుత్వాలు అక్కడ ఉండటం లేదు. ఆ విషయంలో భారత్‌ చాలా నయం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే పరిపాలన సాగిస్తూ వస్తోంది.
    భారతదేశంలో 'ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)' ప్రారంభించడానికి (15 ఆగస్టు 1969) సరిగ్గా ఎనిమిదేళ్ల ముందే పాకిస్తాన్‌లో 'స్పేస్‌ అండ్‌ అప్పర్‌ అట్మాస్పియర్‌ రీసెర్చ్‌ కమిషన్‌' (సుపర్కో) ప్రారంభమైంది. మరి ఈ రోజు అంతరిక్ష పరిశోధనా రంగంలో భారతదేశం ఎక్కడుంది? పాకిస్తాన్‌ ఎక్కడుంది? ఈ విషయంలో ఏ కొంచెం పరిజ్ఞానం ఉన్నవారికైనా విషయం అర్థమవుతుంది. అంతరిక్ష పరిశోధనలలో భారత్‌ ప్రపంచ అగ్ర దేశాలతో పోటీ పడుతూ ఉంటే - పాకిస్తాన్‌కు మాత్రం నేరుగా ఆకాశంలోకి చూసి, అంతరీక్ష పరిశోధనలు చేద్దామన్న ఆలోచన లేదు. ఈ రోజు మన ఇస్రో సాధించిన విజయాలు మహోన్నతమైనవి. ప్రపంచ స్థాయిని అందుకున్నవి. ఈ విషయంలో పాకిస్తాన్‌ మన దరిదాపుల్లో కూడా లేదు. ఇది మత రాజ్యాలు వైజ్ఞానిక ప్రగతి సాధించలేవని చెప్పకనే చెపుతోంది.
     ఇప్పుడు భారత్‌లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా దేశాన్ని 'హిందూ రాష్ట్ర'గా మార్చాలని చూస్తోందంటే... ఇది కూడా ప్రగతి నిరోధక ప్రభుత్వంగా మారిపోతోందని చెప్పకనే చెపుతోంది. అందువల్ల, దేశ ప్రజలకు ఇదొక హెచ్చరిక. త్వరగా మేల్కొని, దేశాన్ని ప్రగతి పథాన నడిపించే ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
     పాకిస్తాన్‌లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1970లో అబ్దుస్‌ సలాంను 'సుపర్కో' కు తొలి ఛైర్మన్‌గా నియమించింది. పాకిస్తాన్‌ భుట్టో పరిపాలనలో ఉన్నప్పుడు 'అహ్మదియా'లు ముస్లింలు కారని ఆనాటి ప్రభుత్వం ప్రకటించింది. డాక్టర్‌ అబ్దుస్‌ సలాం ఒక అహ్మదియా- ఆ విషయం జీర్ణించుకోలేక ఆయన పాకిస్తాన్‌ వదిలి, లండన్‌ వెళ్లిపోయాడు. 1979లో అతనికి భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం అప్పటికే ఆయన ముస్లిమేతరుడు. పైగా 1984లో జియా ఉల్‌ హక్‌ ఒక ఆర్డినెన్స్‌ జారీ చేశాడు. దాని ప్రకారం అహ్మదియాలకు 'అస్సలాము ఆలేకుమ్‌' అనే అర్హత లేదు. 'అస్సలాము ఆలేకుమ్‌' అంటే 'మీకు శాంతి లభించు గాక' అని. ఎదుటివారికి శుభం కలగాలనీ, వారి జీవితం ప్రశాంతంగా గడిచిపోవాలని కోరుకోవడానికి ఆ మనిషి ముస్లిమే అయి ఉండాలా? ఇతరులు కూడా అలా కోరుకుంటూ 'విష్‌' చేస్తే మునిగిపోయేదేమిటీ? ఇంత సంకుచితత్వమా? మనుషులకు ఆ మాత్రం అర్హత ఉండొద్దా? పైగా దానికొక ఆర్డినెన్స్‌ జారీ చేయడం? కానీ, అది వాస్తవంగా అక్కడ జరిగింది.
     ప్రొఫెసర్‌ అబ్దుస్‌ సలాం హేతువాది కాదు. ఇస్లాంకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడినవాడు కూడా కాదు. నోబెల్‌ బహుమతి స్వీకరించే సమయంలో కూడా ఖురాన్‌ నుండి కొన్ని చరణాలు ఊటంకించాడు. సున్నిత మనస్కుడు. మాటలతో ఎవరినీ నొప్పించేవాడు కాదు. ఆయనకు ఆయన మాతృదేశం పాకిస్తాన్‌ అంటే ఎంతో ప్రేమ. తానొక సంప్రదాయ ముస్లింనని సగర్వంగా భావించుకునేవాడు. అహ్మదీయాలు ముస్లింలు కారని అక్కడి పార్లమెంట్‌ ప్రకటించగానే దేశం వదిలిపెట్టి తన నిరసనని తెలియజేశాడు. అయితే మాతృదేశంతో సంబంధాలు తెగతెంపులు చేసుకోలేదు. పాకిస్తాన్‌లో ఎన్నో వైజ్ఞానిక సంస్థలకు రూపకల్పన చేసిన ఆయనను, తర్వాతి కాలంలో 'పాకిస్తాన్‌ వైజ్ఞానిక పిత'గా పిలుచుకున్నారు. కొన్ని వందల మంది విద్యార్థులు పరిశోధనా రంగం వైపు రావడానికి ప్రోత్సహించాడు. అంతటి మహోన్నత స్థాయికి ఎదిగి కూడా - తనలోని ముస్లింనే గుర్తించుకున్నాడు తప్పితే, తన లోని మనిషిని గుర్తించుకోలేకపోయాడు. తానొక విశ్వనరుడన్న భావన లోకి... రాలేకపోయాడు! భౌతిక శాస్త్రానికి అల్లాకు ఏదో సంబంధముందన్నట్లు మాట్లాడేవాడు. మత విశ్వాసాల్లోంచి ఆయన బయటపడలేక పోయాడు. ఆయన దేశంలోని ప్రభుత్వం కూడా బయటపడలేకపోయింది. మత విశ్వాసాలతో ఉన్న వ్యక్తులు, మేధావులైనా, పరిపాలకులైనా విశాల దృక్పథంతో ఎంత మాత్రమూ ఆలోచించలేరనడానికి మనకు అప్పుడప్పుడు ఇలాంటి ఆధారాలు దొరుకుతుంటాయి.
     డాక్టర్‌ అబ్దుస్‌ సలాం ఆక్స్‌ఫర్డ్‌లో చనిపోతే, ఆయన మృతదేహాన్ని పాకిస్తాన్‌ తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయన సమాధి మీద - 'తొలి ముస్లిం నోబెల్‌ లారెట్‌' అని చెక్కించారు. అది వివాదాస్పదమైంది. అందుకు అక్కడి మెజిస్ట్రేట్‌ ఆగ్రహించాడు. తర్వాత పాకిస్తాన్‌ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని, సమాధి మీద ముస్లిం అనే పదాన్ని చెరిపేయించింది. గొప్ప వైజ్ఞానికుణ్ణి మనిషిగా గుర్తించి గౌరవించుకునే సంస్కారం కూడా అక్కడి వారికి లేకపోయింది. మత పెద్దలకు, వారి కనుసన్నల్లో నడిచే రాజకీయ నాయకులకు, పరిపాలకులకు ఎవరికీ ఆయన లోని వైజ్ఞానికుడు కనిపించలేదు. మనిషి కూడా కనిపించలేదు. ఆయన ముస్లిం కాడన్న విషయమే వారికి ప్రధానమైపోయింది. మత పిచ్చిలో ఉన్నవారికి ఎదుటివాడు - 'వారి మతం వాడా కాదా?' అనే విషయమే కనబడుతుంది- తప్ప, మరేదీ కనబడదన్న మాట! పరిపాలకుల ప్రాధాన్యతలేమిటీ? అనే దాని మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
      భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వైజ్ఞానిక స్పృహతోనే దేశం పురోగమన మార్గంలో నడుస్తుందని కలలు గన్నాడు గనక, అందుకు నిరంతర కృషి చేస్తూ వచ్చాడు. దేశం ఈ మాత్రమైనా ప్రపంచ దేశాలలో తలెత్తుకుని నిలబడగలుగుతూ ఉందంటే అందుకు నెహ్రూజీయే కారణం! ఇప్పుడున్న పాలకుల్లాగా నెహ్రూ దేశాన్ని అమ్మడం ప్రారంభించి ఉంటే.. ఆయన ప్రధానిగా ఉన్న సుదీర్ఘకాలంలో ఇప్పటికి ఇంకా ఏమైనా మిగిలి ఉండేదా? ముందు తరం పాలకులు ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ వచ్చినందువల్ల కాదా? వీరికిప్పుడు అధికారం దక్కిందీ? పక్క దేశం పాటించిన తప్పుడు విధానాల్ని గమనించి, మనం వాటిని పాటించకుండా జాగ్రత్త పడాలి. మతానికి ప్రాముఖ్యమిచ్చే వారు ఎక్కడైనా, ఎప్పుడైనా మట్టి కొట్టుకు పోవాల్సిందే! మనిషిని మనిషిగా గుర్తించనంత కాలం ప్రగతి సాధ్యం కాదు. దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో? మత రాజ్యంగా మారితే ఎలా ఉంటుందో మనం పక్కనున్న పాకిస్తాన్‌ను చూసి నేర్చుకోవచ్చు. మత సామ్రాజ్యాల ప్రాధాన్యతలెప్పుడూ మనిషిని మనిషిగా ఎదగనివ్వవు.
      ఇక్కడ మన దేశాన్ని కూడా 'హిందూ రాష్ట్ర'గా మార్చడానికి బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆ పార్టీ ఆధీనంలోనే ఉన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మత కలహాలు రేకెత్తించడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. తాజాగా 10 ఏప్రిల్‌ 2022 శ్రీరామనవమి రోజు ఉత్తర భారతదేశం లోని అనేక రాష్ట్రాల్లో మత కలహాలు జరిగాయి. బిజెపి యేతర ప్రభుత్వాలున్న చోట జరగలేదు. పండుగలు జరుపుకోవడమంటే అల్లరి చేసుకోవడమేనా? మధ్యప్రదేశ్‌ లోని ఖర్‌గాన్‌ పట్టణంలో 84 మంది ముస్లింలను అరెస్టు చేశారు. మత ఘర్షణలు జరిగినప్పుడు హిందువులు, ముస్లింలు ఇరు వర్గాల వారు ఉంటారు కదా? ఒకపక్షం వారితో అల్లర్లు, ఒక్క చేత్తో చప్పట్లు సాధ్యం కాదు గదా? కానీ అల్లర్లు సృష్టించినవారంతా ముస్లింలేనని తీర్మానించడం, అందులో కొందరి ఇళ్ళు బుల్డోజర్లతో కూల్చివేయడం జరిగింది. కట్టుకథలు, పిట్టకథలు నమ్మడంలోనూ, సృష్టించడంలోనూ బిజెపి వారిది అగ్రశ్రేణి. వారి స్థాయిని వేరెవరూ అందుకోలేరు. ఈ అల్లర్లలో ఒక దళిత యువకుడు చనిపోతే... అతనికి ఉర్దూ మాట్లాడటం చేతగాకపోతే, కొందరు ముస్లింలు కొట్టి చంపారని, వారి మీద కఠిన చర్య తీసుకుంటామనే వార్తని పాలకులు మీడియాలో ప్రచారం చేశారు. భాష మాట్లాడలేక పోయినంత మాత్రాన, కొట్టి చంపడం ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేదు.
     ఇకపోతే విద్యా సంస్థల్లో మత సంబంధమైన ఊరేగింపులేమిటీ? ఢిల్లీ జె.ఎన్‌.యు లో శ్రీరామనవమి రోజున ఎబివిపి కార్యకర్తలు కావాలని ఊరేగింపు తీసి, క్యాంపస్‌లో అల్లర్లు సృష్టించారు. అయితే నేరం వామపక్ష విద్యార్థి కార్యకర్తలపైకి నెట్టారు. శ్రీరామనవమి రోజు హాస్టల్‌ మెస్‌లో మాంసాహారం వండనందుకు వారు అల్లరి చేశారని - కథ అల్లి ప్రచారం చేశారు. అయితే హాస్టళ్ళకు మాంసం సరఫరా చేసేవారిని బెదిరించి, సప్లయి మాన్పించింది బిజెపి యువ మోర్చా సభ్యులేనని జాతీయ టెలివిజన్‌ ఛానళ్ళు ప్రకటించాయి. ఏమైనా విద్యాసంస్థలు చదువుకోవడానికా? లేక మతపరమైన పూజలు, ఊరేగింపులు జరుపుకోవడానికా? హైకోర్టులు, సుప్రీం కోర్టులూ ఏం చేస్తున్నట్టూ? ఇలాంటివి సుమోటోగా స్వీకరించలేరా? అయినా ఒక జస్టిస్‌గారే మహాభారతంలో శ్రీకృష్ణరాయభారం గురించి గొప్పగా మాట్లాడినారు కదా? శ్రీకృష్ణుడి మధ్యవర్తిత్వం చెడిపోయినందు వల్లనే కురుక్షేత్ర యుద్ధం జరిగిందని వాపోయారు కదా? వీళ్ళకు వాస్తవ సంఘటనలకు, కావ్యాలలోని సంఘటనలకు తేడా తెలియదు. చారిత్రక పురుషులకు, పురాణ పురుషులకు తేడా తెలియదు. తెలిసినా, తెలియనట్లు నటిస్తూ జనాన్ని తప్పు దోవ పట్టిస్తుంటారు. అధికార పార్టీకి వంత పాడుతుంటారు. దేశంలో గౌరవనీయులైన మూర్ఖులకు కొదువలేదు కదా ?

/ వ్యాసకర్త : కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత,
జీవ శాస్త్రవేత్త /
డా|| దేవరాజు మహారాజు

డా|| దేవరాజు మహారాజు