
ప్రజాశక్తి - బుట్టాయగూడెం
మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ మోడీ మరలా అధికారంలోకి రావడానికి ఆరాటపడుతున్నాడని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని సొసైటీ కళ్యాణ మండపంలో పార్టీ సీనియర్ నాయకులు ఊయుకే చంద్రం, తెల్లం వీరమ్మ అధ్యక్షతన సిపిఐ మండల సమితి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముందుగా ఇటీవల అనారోగ్యంతో మరణించిన సిపిఐ మండల కార్యదర్శి సోదెం వెంకటేశ్వరరావు సేవలను గుర్తు చేసుకుంటూ విప్లవ జోహార్లు సమర్పించి, కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం మోడీ ప్రజల మధ్య చిచ్చుపెట్టి మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను పోషిస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచి, నిలువునా మోసం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు అమలు చేయడానికి జగన్‌మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారని ఆయన తెలిపారు. ప్రజల నెత్తిన టోపీ పెట్టి జగన్ ప్రభుత్వం అధిక విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపి, తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆయన దుయ్యబెట్టారు. మోడీకు వత్తాసు పలుకుతూ, జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమాన్ని పూర్తిగా వదిలేశారన్నారు. కోట్లాది రూపాయల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన హక్కుల సాధనకై ప్రతిఒక్కరు సహకరించాలని, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని, హక్కుల సాధన కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కారం ధారయ్య, జంగారెడ్డిగూడెం, వేలేరుపాడు, కామవరపుకోట, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి సిపిఐ మండల కార్యదర్శులు జెవి రమణ రాజు, బాడిస రాము, టివిఎస్ రాజు, జమ్మి శ్రీనివాసరావు, కొప్పుల నాగరాజు, జిల్లా సమితి సభ్యులు పి.బాలకృష్ణ, పి.ప్రసాద్, ఎపి జిఎస్ జిల్లా నాయకులు బంధం అర్జున్, వేలేరుపాడు వికెఎంయు మండల కార్యదర్శి మడివి కామయ్య, కొమరం గౌతమి, గుండి నాగరత్నం, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.