May 13,2023 20:36

పనులు చేస్తున్న కూలీలు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న కూలీల కష్టాన్ని ఉపాధి సిబ్బంది కాజేస్తున్నారు. ప్రతి వారం ఒక్కో కూలీ రూ.100 చెల్లిస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనం దక్కుతుందని, లేని పక్షంలో ఆరు రోజుల పనికి గానూ కూలి డబ్బులు రూ.500 నుంచి రూ.600 మాత్రమే చెల్లిస్తున్నారని కూలీలు ఆవేదన చెందుతున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో వంద రూపాయలు ముట్టజెప్పాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇదేమని ప్రశ్నించిన వేతనదారులపై సిబ్బంది వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ మేరకు సీతానగరం, పాచిపెంట తదితర మండలాల్లో వేతనదారులు ఆందోళనలకు కూడా దిగిన సంఘటనలు ఉన్నాయి. ఇదంతా జిల్లా ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరుగుతున్నందన ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
           పార్వతీపురం మన్యం జిల్లాలో 1.68లక్షల మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్‌లో కోత విధించడంతో పాటు రెండు పూటలా పని చేయాలనే కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. దీంతో తీవ్ర ఎండల్లోనూ కూలీలు రెండుపూటలా పనిచేయాల్సి వస్తోంది. ఇదే అదునుగా ఉపాధి హామీ సిబ్బంది కూలీల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. కూలీలను అన్ని దశల్లోనూ ఇబ్బందులు గురి చేస్తున్నారు. కూలీలకు కొత్తపని పుస్తకం పంపిణీ నుంచి పేమెంట్‌ వరకు అన్ని స్థాయిల్లో డబ్బులు చెల్లిస్తే తప్ప పనులు జరగని పరిస్థితి జిల్లాలో నెలకొంది. మస్తర్లు వేసే విషయంలో సిబ్బంది కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బులు ముట్టచెబితే కనీస వేతనం, లేదంటే తక్కువ వేతనం వచ్చేలా చేస్తున్నారని కూలీలు ఆవేదన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పని పుస్తకం మొదలు పని కూలి వేతనం వరకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధి కూలీలు తమ సమస్యలను అధికారుల వద్ద ప్రస్తావించినా ఎటువంటి ఫలితం లేకపోగా ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపుగా పని డిమాండ్‌ పెట్టకపోవడం, తక్కువ కూలి వచ్చేలా మస్తర్లు వేయడం చేస్తున్నారని కూలీలు అంటున్నారు.
             జిల్లాలో పలు చోట్ల కూలీలు వారంలో ఆరు రోజులు పని చేయగా పేమెంట్‌ వివరాల్లో మాత్రం కేవలం రెండు లేదా మూడు రోజులు పని చేసినట్లుగా చూపిస్తూ ఆయా రోజులకు సరిపడా వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఆరు రోజులు పని చేసినట్లుగా సంతకాలు చేసినప్పటికీ క్షేత్రస్థాయ సహాయకులు మాత్రం తమ మొబైల్‌ ఫోన్లలో రెండు, మూడురోజులకు డిజిటల్‌ మస్తర్‌లో హాజరు వేస్తున్నారన్నారు. ఉపాధి కూలీలు చాలామంది వరకు నిరక్షరాస్యులు ఉండడంతో తాము ఎన్ని రోజులు పని చేస్తున్నాం, ఎన్ని రోజులకు కూలి చెల్లిస్తున్నారో తెలియని పరిస్థితిలో కూలీలు ఉన్నారు. తాము సంతకాలు చేసిన పేపర్‌ మస్తర్లకు ఎటువంటి ప్రాముఖ్యత లేని పక్షంలో తమ వద్ద సంతకాలు తీసుకోవడం ఎందుకని కూలీలు ప్రశ్నిస్తున్నారు. కనీస కూలి డబ్బులు కూడా రావడం లేదని ఫీల్డు అసిస్టెంట్లను ప్రశ్నించగా కూలీలు చేసిన పనికి మాత్రమే వేతనం చెల్లిస్తున్నామని చెబుతున్నారు. ఆరు రోజులు పని చేస్తే రెండు, మూడు రోజుల చెల్లింపుల వివరాలు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారని ప్రశ్నించగా వారి నుంచి ఎటువంటి సమాధానమూ రావడం లేదు. పనుల పర్యవేక్షణలో భాగంగా పైస్థాయి అధికారులు పని ప్రదేశాల్లో సందర్శించినప్పటికీ కూలీలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పేపర్‌ మస్తర్లను, డిజిటల్‌ మస్తర్లను పరిశీలించాలని కూలీలు కోరుతున్నారు.
 

                                                          కనీస వేతనం రూ.256 చొప్పున చెల్లించాలి

ఉపాధి హామీ చట్టం నిర్దేశించిన ప్రకారం రోజుకు కనీస వేతనం రూ.256 చొప్పున చెల్లించాలి. వారంలో ఆరు రోజులు పని చేయగా రెండు లేదా మూడు రోజులు పని చేసినట్లుగా హాజరు ఎందుకు వేస్తున్నారో చెప్పాలి. కూలీలు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కూలీలకు వేసవి అలవెన్సులను పునరుద్ధరించాలి. ఒక్కపూట మాత్రమే పని చేయించాలి. ఇప్పటికైనా పై స్థాయి అధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం అమలు చేయాలి.
                                             - కొల్లి గంగునాయుడు,
                                  వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి.