Apr 08,2022 06:48

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్‌ విద్యను అందించాలనే లక్ష్యంతో 2008లో నూజివీడులో ఏర్పాటు చేసిన రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఐఐఐటి)లో నేడు పలు సమస్యలు తిష్ట వేశాయి. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన, పరిజ్ఞానాన్ని అందించాల్సిన విద్యాలయాల్లో అంతర్గత కలహాలు, విభేదాలు చోటుచేసుకోవటం విద్యార్థులకు శాపంగా మారింది. యూనివర్శిటీ అధికారులు కాసులకు కక్కుర్తిపడి అనుభవం లేని మెస్‌ కాంట్రాక్టర్లను నియమించటం వల్ల విద్యార్థులు నాసిరకమైన ఆహారంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. విద్యా సంవత్సరం ఇవ్వాల్సిన యూనిఫామ్‌, బుక్స్‌, ల్యాప్‌టాప్‌ కూడా సకాలంలో అందడం లేదు. ఈ నేపథ్యంలో పేద గ్రామీణ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏడాదికి ముగ్గురు, నలుగురు చొప్పున విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం ఆందోళన కలిగిస్తున్న విషయం.
 

                                                 పద్నాలుగేళ్ళు గడిచినా గందరగోళమే

నూజివీడు ఐఐఐటి స్థాపించి 14 సంవత్సరాలు అవుతున్నా నేటికీ విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవు. ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటిల పరిస్థితీ అంతే. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, హాస్టల్‌ వసతి, నాణ్యమైన విద్య అందించలేని పరిస్థితి ఐఐఐటీ లలో నెలకొంది. పదో తరగతి వరకు తెలుగులో విద్యను అభ్యసించిన విద్యార్థులు పి.యు.సి మొదటి సంవత్సరంలో ఆంగ్ల బోధనను అందుకోలేకపోతున్నారు. అందువల్ల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆంగ్ల భాషతో పాటు తెలుగులో కూడా విద్యా బోధన చేయాలని విద్యార్థులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హాస్టల్‌ రూముల్లోను, భోజనశాల దగ్గర విద్యార్థుల పరిస్థితి, ప్రవర్తన ఎలా ఉందో పర్యవేక్షణ లోపించింది. రాత్రులు యూనివర్సిటీ అధికారులు ఐఐఐటిల్లో పర్యటించి సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేయటంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఐఐఐటీ నిబంధనలను వీరు పూర్తిగా అమలు జరపటం లేదు. విద్యార్థులకు తూతూ మంత్రంగా కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. మాధ్యమం మార్పుకు, ర్యాగింగ్‌ నివారణకు, ఒత్తిళ్లకు తదితర అంశాలను విద్యార్థులలో వున్న భయాన్ని తొలగించటానికి మానసిక శాస్త్రవేత్తలతోనూ, వైద్య నిపుణులతోనూ కౌన్సిలింగ్‌ చేయటంలో లోపం జరుగుతున్నది. సాధారణంగా సాంకేతిక విద్యను అందించే కళాశాలలో ర్యాగింగ్‌ ఎక్కువగా ఉంటుంది. ర్యాగింగ్‌ నుండి విద్యార్థుల దృష్టిని మళ్లించడానికి క్యాంపస్‌లో పోలీస్‌ ఔట్‌ పోస్టు ఏర్పాటు చేయాలని అనేక సూచనలు వచ్చినప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేటాయించలేదు.
 

                                                              ఆగని ఆత్మహత్యలు

నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ఐఐఐటీలలో విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తుంది. ఇందుకు గల కారణాలను వెలికి తీయటంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నది. యాజమాన్యం వైఖరి ఇలా ఉంటే ప్రభుత్వ అజమాయిషీ జాడే లేదు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యూనివర్సిటీ ఏర్పడిన దగ్గర నుండి సుమారుగా 30 మందికి పైగా విద్యార్థులు ఒత్తిడి కారణంగాను, చదవలేక, వివిధ ఇతర కారణాలు వల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారు.
 

                                                       మెస్‌ బిల్లు చెల్లింపుల్లో జాప్యం

మెస్‌ కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోడంతో మెనూ ప్రకారం భోజనాన్ని అందించలేమని నిర్వాహకులు యాజమాన్యంతో కరాఖండిగా చెప్తున్నారు. రోజుకు మూడు పరీక్షల చొప్పున కాకుండా రోజు విడిచి రోజు నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నా విద్యాశాఖ పట్టించుకోవడంలేదు. దీంతో వెంట వెంటనే పరీక్షలు రాయలేక వారు ఒత్తిడికి గురవుతున్నారు.
 

                                                    అరకొర సౌకర్యాలు..ఏర్పాట్లు...

ట్రిపుల్‌ ఐటీల్లో చేరిన ప్రతి విద్యార్థికీ ప్రభుత్వమే ల్యాప్‌టాప్‌ అందిస్తోంది. అయితే మూడేళ్లుగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ లు పూర్తి స్థాయిలో అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐఐటీలకు సరైన బడ్జెట్‌ కేటాయింపులు చేయకపోవడమే కారణమని తెలుస్తోంది. పైగా అవసరమైన పరికరాలనూ ప్రభుత్వం అందించడం లేదు. ఎన్నో ఏళ్లుగా తరగతి గదులు, హాస్టల్‌ రూముల్లో విరిగిపోయిన బల్లలు, మంచాలు, విద్యుత్‌ ఉపకరణాల మరమ్మతులు జరగడం లేదు. బోధనా సిబ్బందిని కూడా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా కాంట్రాక్ట్‌ పద్ధతిలో నడిపిస్తున్నారు. తరగతి భవనాలు పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో ప్రైవేట్‌ భవనాలను అద్దెకు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు.
 

                                                           వైద్య సేవలు కరువు

ఐఐఐటి విద్యార్థుల ఆరోగ్య అవసరాలకు వేల కోట్ల రూపాయలతో యూనివర్శిటీలో హాస్పిటల్‌ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు 24 గంటలూ వైద్య సదుపాయం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ క్యాంపస్‌లో ఉన్న హాస్పిటల్లో సరైన వైద్య సదుపాయాలు, సౌకర్యాలు లేవు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేకపోవడంతో అనారోగ్యం ఏర్పడినప్పుడు తక్షణ వైద్యం కోసం వారిని పక్కన ఉన్న నగరాలకు తరలిస్తున్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యను అభ్యసించగలరు. కానీ వైద్యమే కరువైతే వారు చదువులో ఫలితాలను ఎలా సాధించగలరు ?
 

                                                            పర్యవేక్షణా లోపం

వి.సి, డైరెక్టర్లు క్యాంపస్‌లో ఉండి విద్యార్థులను పర్యవేక్షిస్తూ వారి కదలికలను కనిపెట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వీటితో పాటు సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌ అధికారిని ఐఐఐటీ పరిపాలన అధికారిగా నియమించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు, మేధావులు కోరుతున్నారు. ఐఐఐటీకి చెందిన 6000 మంది విద్యార్థులు ఒక పక్క అరకొర వైద్యం, మరోవైపు నాసిరకం భోజనంతో ఇబ్బందులు పడుతున్నారు. మెస్‌ కాంట్రాక్టర్లు నాణ్యమైన ఆహారాన్ని అందించలేక పోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన యూనివర్శిటీ అధికారులు మాత్రం మెస్‌ కాంట్రాక్టర్లకే వత్తాసు పలుకుతున్నారు. దీనివల్ల విదార్థులు అర్ధాకలితో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐఐఐటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ అనేక రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఐఐఐటీల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కూడా ఆందోళనలు చేసింది. ఐఐఐటీల ప్రతిష్టను కాపాడుకోవాలన్నా, విద్యార్థులకు సరైన విద్యను అందించాలన్నా ప్రభుత్వం తక్షణం కొన్ని చర్యలు చేపట్టాలి. సీనియర్‌ ఐ.ఎ.ఎస్‌ అధికారిని పాలనా అధికారిగా నియమించాలి. ప్రతి సంవత్సరం యూనివర్సిటీకి నిధులు కేటాయించాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. నాణ్యమైన బోధనా సిబ్బందిని ఏర్పాటు చెయ్యాలి. నూజివీడు ఐఐఐటీలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి.
 

/ వ్యాసకర్త : ఎస్‌.ఎఫ్‌.ఐ కృష్ణా జిల్లా అధ్యక్షుడు,
సెల్‌: 9010849524 /
ఎమ్‌. సోమేశ్వరరావు