
అస్తవ్యస్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ
ప్రాణాలు తీస్తున్న కరెంటు తీగలు
పొలాల్లో కిందకు వేలాడుతున్న వైనం
భవనాలకు అతి దగ్గరగా విద్యుత్ లైన్లు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
వేలాడుతున్న విద్యుత్ వైర్లు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోనే తరచూ పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల 23న గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామ శివారున పామాయిల్ తోటలో బోరుబావి తవ్వుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హై టెన్షన్ వైర్లు బాగా కిందకు వేలాడి ఉండడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.
15 రోజుల క్రితం జగ్గంపేటలో ఐరన్ దుకాణంలో పనిచేస్తున్న క్రమంలో ఇనుప ఉచకు అతి సమీపంలో ఉన్న విద్యుత్తు వైర్లు తగిలి షాక్‌కు గురైన ఒక బాలుడు అక్కడికక్కడే మతి చెందాడు. ఇలా తరచూ జరుగుతున్న అనేక ఘటనల్లో అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
రాజమండ్రి సర్కిల్ ఈస్టర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, జగ్గంపేట, అమలాపురం, రాజమండ్రి, రామచంద్రాపురం, రంపచోడవరం డివిజన్లలో సుమారు 18 వేల కిలోమీటర్ల పొడవున ఎల్‌టి లైన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో విద్యుత్ అధికారులు సరఫరా వ్యవస్థ సమస్యలపై సర్వే నిర్వహించారు. సుమారు 2 వేల ఒరిగిన స్తంభాలను గుర్తించారు. 6 వేల స్తంభాలు పాడైనవిగా, 4 వేలు స్తంభాలకు తీగలు కిందకు ఒరిగినవిగా, సుమారు 6 వేలు కండక్టర్లు పనిచేయనివిగా గుర్తించి సరి చేశారు. ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుతూ సమస్యలను పరిష్కరిస్తున్నా అనేకచోట్ల విద్యుత్ తీగలు వేలాడుతూనే కనిపిస్తున్నాయి.
ప్రధానంగా పట్టణ ప్రాంతాలైన కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని,గొల్లప్రోలు, ఏలేశ్వరం వంటి ప్రాంతాల్లో పలు కూడళ్ళలో విద్యుత్ తీగలు నివాస గృహాలకు అతి సమీపంగానే ఉంటున్నాయి. కొన్నిచోట్ల అయితే ఇళ్ల గోడలను ఆనుకుని ఉంటున్నాయి. దాంతో పలువురికి విద్యుత్ షాక్ తగిలి ప్రమాదాలకు గురవుతున్నారు. రాజమండ్రి సర్కిల్ పరిధిలో గత ఆరేళ్లలో విద్యుత్ ప్రమాదాలకు గురై 114 మందికి పైనే మరణించారు. మరోవైపు ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో విద్యుత్తు స్తంభాలకు సమీపంలో నిర్మాణాలు ఇష్టారీతిన సాగిస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కొందరు నిర్లక్షణ ధోరణితో వ్యవహరిస్తున్నారు. అయితే వాటిని నివారించాల్సిన కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో విద్యుత్తు వైర్లు ఉన్నచోట్ల యథేచ్ఛగా నిర్మాణాలు సాగిపోతున్నాయి. అనంతరం వివిధ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు పలు ప్రాంతాల్లో పొలాలలో విద్యుత్ స్తంభాలకు ఉన్న తీగలు వేలాడుతూ కనిపిస్తున్నాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న అంతగా పట్టించుకోవడంలేదని విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
గండేపల్లి మండలం రాజాపురం గ్రామ శివారులో బిక్కిన వెంకటరావు పొలంలో చేతికి అందే ఎత్తులో వైర్లు కిందకి వేలాడుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. నిలబడితే తాకే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను చూసి రైతులు, ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వాటిని నిరంతరం పర్యవేక్షించడంలేదు. దీంతో కరెంట్ షాక్ ప్రమాదాలు తరచూ జరుగుతున్నా సంబంధిత శాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇలా అనేక చోట్ల ప్రమాదాలకు నిలయాలుగా విద్యుత్ వైర్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.ఇలాంటి ప్రమాద సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారంటున్నారు.