Feb 18,2023 21:50

పూళ్లలో ఆర్‌టిసి బస్సు ఢకొీని ముగ్గురు దుర్మరణం
పట్టిసీమలో గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు మృతి
ప్రజాశక్తి - యంత్రాంగం
              శివరాత్రి ఉత్సవాల్లో జనం నిమగమై ఉండగా జిల్లాలో మృత్యుఘంటికలు మోగాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఆర్‌టిసి బస్సు ఢకొీని మగ్గురు భవన నిర్మాణ కార్మికులు, గోదావరి గల్లంతై మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అలముకుంది. బంధువుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.
            భీమడోలు  -  
మృత్యువు ఎటువైపు నుంచి ఎలా ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు.. ఈ తరహాలోనే రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటున్న భవన నిర్మాణ కార్మికులపైకి ఆర్‌టిసి బస్సు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ముగ్గురి ప్రాణాలను కబళించింది. ఈ విషాద ఘటన జాతీయ రహదారిపై భీమడోలు మండలం పూళ్ల వద్ద శనివారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవ్వగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామానికి చెందిన దండ్రు వీరాస్వామి(30), కర్నాటి మహేంద్ర(33), ఊటకూరి ఫణీంద్ర(27), గండికోట శ్రీను భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఇంటి నిర్మాణాలకు అవసరమైన గుమ్మాలు కొనేందుకు రెండు ద్విచక్ర వాహనాలపై పూళ్ల వెళ్లారు. గుమ్మాలు కొనుగోలు విషయమై పూళ్ల వద్ద రోడ్డుపై ఆగి చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ఒకరి బండిలో పెట్రోల్‌ అయిపోవడంతో మరో వాహనంలోని పెట్రోలు తీసి నింపుకుంటున్నారు. ఈ సమయంలో భీమవరం నుంచి భీమడోలు మీదుగా చింతలపూడి వెళ్తున్న భీమవరం డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు రోడ్డు పక్కన ఉన్న వీరిపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వీరాస్వామి, మహేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను, గండికోట శ్రీనును 108 అంబులెన్సులో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఫణీంద్ర మృతిచెందాడు. గండికోట శ్రీను ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. భీమడోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన
నిర్లక్ష్యంగా ఆర్‌టిసి బస్సు నడిపి ముగ్గురు మృతికి కారణమయ్యారని, తక్షణం వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ కురెళ్లగూడెం గ్రామస్తులు పూళ్ల వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు, అధికారులు బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం ఆందోళన విరమించారు.
పోలవరం: వారంతా పట్టిసీమ ఉత్సవాల్లో ఆనందంగా గడుపుదామని వచ్చారు. గోదావరి ఇసుక తిన్నెల్లో ఉల్లాసంగా కలయతిరిగారు. గోదావరిలో స్నానాలు చేసి ఆలయానికి వెళదామనుకున్నాను.. ఇంతలో ఓ ప్రమాదం ముగ్గురిని కబళించింది. వారి కుటుంబాల్లో తీరని విషాదం నిపింది. అధికారులు ఏర్పాటు చేసిన స్నానరేవులు రద్దీగా ఉండటంతో సమీపంలోని అనధికార రేవులో స్నానం చేసేందుకు దిగిన ముగ్గురు గోదావరిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో శనివారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి పోలవరం ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసపాడు గ్రామానికి చెందిన ఓలేటి అరవింద్‌(20), ఎస్‌కె.లుక్మన్‌(19), పెద్దిరెడ్డి రామ్‌ప్రసాద్‌(18), మరో నలుగురు కలిసి మహాశివరాత్రి సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమకు ఉదయం చేరుకున్నారు. ఉత్సవాల సందర్భంగా స్నానాల కోసం కేటాయించిన రేవుల్లో కాకుండా దూరంగా అనధికార రేవు వద్ద వీరు స్నానాలు చేసేందుకు వెళ్లారు. అక్కడ నదిలోతుగా ఉండటం, గోదావరి నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న స్నేహితులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వారు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికి వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలవరం డిఎస్‌పి కె.లతాకుమారి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోలవరం సామాజిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.