ప్రజాశక్తి -కొత్తకోట:భీమునిపట్నం - నర్సీపట్నం( బిఎన్ ) రోడ్డులో కల్వర్టుల నిర్మాణ పనులు వాహనదారుల పాలిట మృత్యు కుపాలుగా మారాయి. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం, ఆర్‌అండ్‌బి శాఖ అధికారుల ఉదాసీనత వెరసి వాహన దారుల పాలిట శాపంగా మారింది. రూ.78 కోట్లతో బిఎన్ రోడ్డు విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. రావికమతం మండలంలో కొత్తకోట నుంచి దొండపూడి, టి.అర్జాపురం, పి.పొన్నవోలు, మేడివాడ వరకూ మార్గ మధ్యలో సుమారు 12 కల్వర్టులు నిర్మాణ పనులను రోడ్డు కాంట్రాక్టర్లు చేపడుతున్నారు. నిర్మాణ పనుల వద్ద కనీస ప్రమాద హెచ్చరిక బోర్డులు, రెడ్ రిబ్బన్లు ఏర్పాటు చేయక పోవడంతో ఈ రోడ్డులో ప్రయాణం చేసే వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి గోకివాడ గ్రామానికి చెందిన పెద్ది నూకరాజు, లక్ష్మి భార్య భర్తలు పి.పొన్న వోలు గ్రామ సమీపంలో ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి కల్వర్టులో వాహనంతో సహ పడి పోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు తగిలి ప్రాణా పాయం నుంచి తప్పించు కున్నారు. దగ్గరకు వచ్చే వరకూ కల్వర్టు నిర్మాణ పనులు కనబడక పోవడంతో ఈ ప్రమాదాలు జరుగు తున్నాయి. గత నెల రోజుల్లో ఈ రోడ్డులో పలు ప్రమాదాలు చోటు చేసుకోగా సంబంధిత ఆర్‌అండ్ బి శాఖ, పోలీస్ శాఖ అధికారులు స్పందించ లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు మర్మత్తులు లేక కల్వర్టుల నిర్మాణ పనులను సూచిస్తూ ఖచ్చితంగా హెచ్చరిక బోర్డులు, రెడ్ రిబ్బన్ ఏర్పాటు చేయాల్సిన కాంట్రక్టర్ ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడం పై పలు వురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై కొత్తకోట ఎస్‌ఐ విభూషణరావును వివరణ కోరగా.. త్వరలోనే కల్వర్టు నిర్మాణ పనుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తామని, అందుకు ఆర్ అండ్‌బి శాఖ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల దృష్టిలో పెట్టుకొని వాహన దారులు పలు జాగ్రత్తలు పాటించాలని ఎస్‌ఐ సూచించారు.










