Mar 21,2023 00:25

ఎస్సార్‌ కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్న మృతుని కుటుంబీకులు, మద్దతుగా నిలిచిన సిఐటియు నాయకులు అప్పారావు

ప్రజాశక్తి-కంచరపాలెం : ఎస్సార్‌ కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తూ విధుల్లో ఉండగా ఈ నెల 2వ తేదీన ప్రమాదానికి గురై 8వ తేదీన చనిపోయిన బడి అప్పారావు కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, కార్మికుని మృతికి కారణమైన కంపెనీ యజమానిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఆందోళన చేశారు. కాన్వెంట్‌ జంక్షన్‌ సమీపంలో ఉన్న ఎస్సార్‌ కంపెనీ వద్ద మృతుని కుటుంబ సభ్యులు కార్మికులతో కలిసి సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మృతుని భార్య భూలక్ష్మి మాట్లాడుతూ, 2వ తేదీన ఎస్‌ఆర్‌ కంపెనీలో డ్యూటీ చేస్తుండగా తన భర్తకు ప్రమాదం జరిగిందని, సెవెన్‌ హిల్స్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ చేశామని యాజమాన్యం నుంచి ఫోన్‌ వచ్చిందని తెలిపారు. ఆ రోజు నుంచి 8వ తేదీ వరకూ సెవెన్‌ హిల్స్‌ హాస్పిటల్‌లోనే ఉంచి వైద్యం చేయించారని, ఖర్చు భారీగా అవుతుందని కెజిహెచ్‌కు తీసుకెళ్తామని చెప్పిన పావుగంటలోపే 'నీ భర్త చనిపోయారు' అని ఆసుపత్రి యాజమాన్యం చెప్పిందని వివరించారు. కంపెనీలో తన భర్తకు ఏ ప్రమాదం జరిగిందో చెప్పకుండా కళ్లు తిరిగి పడిపోయారని, ఆసుపత్రిలో చేర్పించామని యాజమాన్యం మోసం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. పదేళ్లకు పైగా తన భర్త ఈ కంపెనీలోనే పనిచేస్తున్నారని తెలిపారు. భర్త మృతితో తాను, పిల్లలు అనాథలయ్యామని, ఎస్సార్‌ కంపెనీ యాజమాన్యం రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్‌ కంపెనీ కార్మికులు, మృతుని భార్య, పిల్లలు, సిఐటియు సెక్రటరీ ఒ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు నష్టపరిహారాన్ని ఎస్సార్‌ కంపెనీ యాజమాన్యం ఇవ్వాలని సిఐటియు సెక్రటరీ ఒ.అప్పారావు డిమాండ్‌ చేశారు.