
ప్రజాశక్తి లేపాక్షి : ఆత్మహత్యకు పాల్పడిన భూపోరాట రైతు వెంకటేష్ కుటుంబానికి అండగా ఉంటామని కెవిపిఎస్ నాయకులు అన్నారు. కెవిపిఎస్ మండల కార్యదర్శి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మంగళశారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. కుశలవ ఆర్గానిక్ కంపెనీకి రైతులకు మధ్య జరుగుతున్న భూపోరాటంలో భాగంగా అధికారుల తీరుకు మనస్థాపం చెందిన వెంకటేష్ తన పొలం లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అయితే అతని మృతిపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బాధితుడి తండ్రి కుశలవ కంపెనీకి భూమిని అమ్మివేయడంతో చేసుకోవడానికి ఉపాధిలేక పని చేయడానికి పొలం లేక ఇబ్బంది పడుతుండేవాడన్నారు. మృతుని కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. కేసు తప్పు దోవ పట్టించడానికి కుట్రలు పన్నితే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, జిల్లా కార్యదర్శి రమణ, వెంకటేష్, కమిటీ సభ్యులు నారాయణప్ప, క్రిష్టప్ప, రైతు లు గంగాధరప్ప, రామకృష్ణపప, నరసింహప్ప, తిప్పన్న పాల్గొన్నారు.