Oct 03,2023 00:58

ప్రజాశక్తి - చిలకలూరిపేట : స్థానిక అడ్డరోడ్‌ సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన షేక్‌ వాజిదా, బ్రెయిన్‌ డెడ్‌ అయ్యి అవయవదానం చేసిన కట్టా కృష్ణ కుటుంబాలకు అండగా ఉంటామని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ అన్నారు. ఈ మేరకు ఆ కుటుంబాలను వారు సోమవారం పరామర్శించారు. వాజిదా, కృష్ణ చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ప్రభుత్వం నుండి ఈ కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. పట్టణంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి ట్రాఫిక్‌ సిగల్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉందని ఎంపీ అన్నారు. చాలాకాలంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామని, ఏర్పాటుకు రూ.45 లక్షలవుతుందని చెప్పారు. ఈ మొత్తాన్ని తన ఎంపీ ల్యాడ్స్‌ నుండి కేటాయిస్తానని హామీనిచ్చారు. ట్రాఫిక్‌ సిగల్స్‌ ఏర్పాటు అంశాన్ని ఇటీవల శాసన మండలి సమావేశాల్లోనూ ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ తీసుకెళ్లారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు జి.లింకన్‌, ఎస్‌.కోటేశ్వరరావు, ఎవిఎం సుభానీ, జి.ఆంజనేయులు, ఎంవి.రత్నారెడ్డి, ఏలియా, డేవిడ్‌ పాల్గొన్నారు.