May 15,2023 23:12

యానాం ఎంఎల్‌ఎ అశోక్‌తో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

- ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు పరిహారమివ్వాలి
- బాధిత కుటుంబ సభ్యులను సిపిఎం పరామర్శ
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
తాళ్లరేవు మండలం సుబ్బారాయుడు దిమ్మ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారమివ్వాలని సిపిఎం నాయకులు కోరారు. కాకినాడ జిజిహెచ్‌ మార్చురీ వద్ద ఉన్న బాధిత కుటుంబ సభ్యులను సోమవారం సిపిఎం జిల్లా ప్రతినిధి బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పాండిచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, యానాం ఎంఎల్‌ఎ గొల్లపల్లి అశోక్‌లను కలిశారు. బాధిత కుటుంబాలకు పాండిచ్చేరి ప్రభుత్వ సహకారం, కంపెనీ నుండి పరిహారం కోసం కృషి చేయాలని కోరారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని కంపెనీతో మాట్లాడి చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందించాలని సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ కోరారు. మృతిచెందినవారి కుటుంబాల్లో పిల్లలు చదువులు, పెళ్లిళ్లుకు ఎదిగిన వారున్నారన్నారన్నారు. ఆ కుటుంబాల పోషణ కోసం ఏ ఉపాధి లేక కష్టం అయినా రొయ్యల ప్రాసెసింగ్‌ పనికి వెళుతున్నారని సిపిఎం బృందానికి మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. అక్వా కంపెనీల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడానికి కంపెనీ యాజమాన్యం, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆక్వా కంపెనీ యజమానులు ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారించాలని, ఆర్‌అండ్‌బి హైవే అధికారులు డివైడర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కెఎస్‌ శ్రీనివాస్‌, టి.రాజా, దినేష్‌ తదితరులు ఉన్నారు.