వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్న సూర్య
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : సినీహీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసే క్రమంలో పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని యక్కలవారిపాలెంలో నక్క వెంకటేష్, పోలూరు సాయి అనే ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇది తెలిసిన సూర్య వెంటనే స్పందించారు. మృతుల కుటుంబాలతో వీడియో కాల్‌లో మాట్లాడి పరామర్శించారు. భర్తను గతంలోనే కోల్పోయిన తాను ఇప్పుడు కొడుకునూ పోగొట్టుకున్నానని మృతుల్లో ఒకరి తల్లి కన్నీరు మున్నిరుగా విలపించారు. దీనికి చలించిపోయిన సూర్య మాట్లాడుతూ పోయిన ప్రాణాలను తీసుకురాలేమని, అయితే మీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు. అమ్మాయికి మంచి ఉద్యోగం ఇప్పించే భాద్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.










