Sep 27,2023 17:27

గాయపడిన మహిళకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి
ప్రజాశక్తి - చింతలపూడి
   పాశ్చానగరంలో పిడుగుపడి మృతి చెందిన ఇద్దరు మహిళల కుటుంబాలను టిడిపి నియోజకవర్గ యువనాయకులు సోంగా రోషన్‌ కూమార్‌, యాలలీలా ప్రశాంతి బుధవారం పరామర్శించారు. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోత్స్నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని, జోత్స్నా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలు ఆమెకు కూడా వర్తించే విధంగా చొరవ చూపి ఆదుకోవాలని ఏలూరు సబ్‌ కలెక్టర్‌ జివి.సత్యనారాయణని ప్రత్యేకంగా కోరారు. మృత్యువాత పడిన ఇద్దరు మహిళల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే రూ.4 లక్షల విపత్తుల ఆర్థిక సహాయం కాకుండా, రూ.15 లక్షల ప్రభుత్వ సహాయం అందించాలని టిడిపి తరుపున డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు పల్లి శ్రీను, నియోజకవర్గ ఐటిడిపి అధ్యక్షులు బోడ అనీష్‌, తదితరులు పాల్గొన్నారు.
పిడుగుపాటుకు గురైన మహిళల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం
ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్‌ జివివి.సత్యనారాయణ
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారమందించి ఆదుకుంటామని నూజివీడు ఇన్‌ఛార్జి సబ్‌ కలెక్టర్‌ జివివి.సత్యనారాయణ తెలిపారు. లింగపాలెం మండలంలో మంగళవారం పిడుగుపాటుకు గురైన కుటుంబాలను జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాల మేరకు బుధవారం ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్‌ సత్యనారాయణ పరామర్శించారు. తీవ్ర గాయాలపాలై చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సొంగా జ్యోత్స్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. జ్యోత్స్నకు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి అధికారులను సత్యనారాయణ ఆదేశించారు. పిడుగుపాటుకు గురై మరణించిన మృతదేహాలకు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న శవ పంచనామాను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ జిఒ 15 ప్రకారం రూ.4 లక్షలు చొప్పున నష్టపరిహారం శవ పంచనామ నివేదిక అందిన వెంటనే, ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. అంతేకాక ఆ కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్నివిధాలా ఆదుకుంటామని సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటిమెడికల్‌ దుర్గారావు, కాంతారావు, లింగపాలెం మండల పరిషత్‌ అధ్యక్షులు ముసునూరి వెంకటేశ్వరరావు, తహశీల్దార్‌ మురళీకృష్ణ పాల్గొన్నారు.