ప్రజాశక్తి - కాకినాడ, తాళ్లరేవు, యానాం
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలోని అపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ( రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్)లో పని చేస్తున్న మహిళా కార్మికులు బస్సు ఢకొీన్న ప్రమాదంలో ఆదివారం మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయా కుటుంబాల సభ్యులు అపెక్స్ కంపెనీ ప్రతినిధులకు సోమవారం ఉదయం అల్టిమేటం జారీ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపు పరిహారం తేల్చకపోతే మృతదేహాలతో అపెక్స్ కంపెనీ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. దీనిపై మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం కాకినాడ జి.జి.హెచ్ మార్చురీ వద్ద ఆయన మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. ఐదున్నర లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం అందజేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు మల్లాడి కష్ణారావు తెలిపారు. అదేవిధంగా బస్సు యాజమాన్యం మృతి చెందిన వారికి రూ.ఒక లక్ష, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరికీ చెరో లక్ష, గాయా లయి చికిత్స పొందుతున్న వారికి రూ. 25వేలు అందించడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ప్రతి కుటుంబానికి తన వంతు సహాయంగా రూ. లక్ష అంద జేయనున్నట్లు మల్లాడి కృష్ణారావు తెలిపారు. పుదుచ్చేరి సిఎం. రంగస్వామిని స్వయంగా కలిసి క్షతగాత్రులకు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మల్లాడి కృష్ణారావు తెలిపారు.
ఎంఎల్‌ఎ అశోక్ సహాయం
సోమవారం ఎంఎల్‌ఎ అశోక్ విలేకరులతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలను, వారి పిల్లలను ఏవిధంగా ఆదుకోవాలో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళుతున్నట్లు, తెలిపారు. ఎంఎల్‌ఎగా వ్యక్తిగతంగా ఒక్కో మృతిరాలి కుటుంబానికి రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.30 వేల చొప్పున సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
మతుల కుటుంబాలను ఆదుకోవాలి : సిఐటియు
యానాం తాళ్ళరేవు బైపాస్ సుబ్బారాయుడు దిమ్మ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున పరిహారమివ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రొయ్యల కంపెనీల యాజమాన్యం, ఆర్ అండ్ బి హైవే అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
మృతదేహాలు అప్పగింత
కాకినాడ కార్పొరేషన్ : తాళ్లరేవు మండలం కోరింగ వద్ద జరిగిన ప్రమాద ఘటనలో ఏడుగురి మృతదేహాలకు ఆదివారం వీరికి, యానం పోలీసులు, కోరింగ, కాకినాడ, పెదపూడి, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సవ పంచనామా పూర్తి చేశారు. సోమవారం ఉదయం ఏడు మృతదేహాలకు జిహెచ్ ఫోరన్సిక్ హెచ్‌ఒడి ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం పూర్తయ్యేంతవరకు యానాం ఎంఎల్‌ఎ గొల్లపల్లి అశోక్, మాజీ ఎంఎల్‌ఎ మల్లాడి కృష్ణారావు కాకినాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్నారు
ఆంధ్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి
- ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఈశ్వర రావు
తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం సుబ్బారెడ్డి దిమ్మ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ఎపి ముఖ్యమంతి జగన్మోహన్ రెడ్డి స్పందించి మానవతా దక్పథంతో మృతుల కుటుంబాలకు ఆర్థిక సహకారాన్ని అందించాలని తాళ్లరేవు ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు కోరారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదాల్లో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మానవత దక్పథంతో స్పందించి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఆర్థిక సహకారం అందించిందన్నారు. ఆదివారం జరిగిన ప్రమాదంలోని మృతుల కుటుంబాలను ప్రభుత్వం, పరిశ్రమల యాజ మాన్యం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు ప్రజాసంఘాల నాయకులు వల్లు రాజబాబు, దుప్పి అదృష్టదీపుడు, సంగాడి కళావతి ఉన్నారు.
తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి
- కోరంగి ఉపసర్పంచ్ కామాడి భైరవమూర్తి
కోరంగి పంచాయతీ ఎసి సుబ్బారెడ్డి దిబ్బ సెంటర్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కోరంగి ఉప సర్పంచ్ కామాడి బైరవ మూర్తి అన్నారు. ఈ జంక్షన్లో చిన్న బొడ్డు వెంకటాయపాలెం, బైపాస్ 216 నుంచి గుడ్డివాని తూము సెంటర్ మీదుగా సీతారాం పురం మీదుగా తాళ్లరేవుకు వెళ్లడానికి రెండు రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయన్నారు. వేలాదిమంది రొయ్యల కంపెనీలలో పని చేసే మహిళా కార్మికులు ఆటోల ద్వారా ఈ జంక్షన్ నుంచే ప్రయాణం చేస్తారన్నారు. అందువల్ల ఈ జంక్షన్‌ను పూర్తి స్థాయిలో విస్తరించేలా, రాత్రి సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.
జిజిహెచ్ నుంచి మృతదేహాలను యానాం తరలిస్తున్న ఎంఎల్‌ఎ అశోక్










