Jun 25,2023 23:55

మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి- అనంతగిరి:వేపాడ మండలంలో క్వారీ పనులు చేస్తూ మతి చెందిన మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని జెడ్పిటిసి దీసరి. గంగరాజు డిమాండ్‌ చేశారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురం నల్లరాయి క్వారీ పనులకు వెళ్లిన టోకురు పంచాయతీ పూలగూడ గ్రామానికి చెందిన గెమ్మెల. బుద్దు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకొన్న జెడ్పిటిసి గంగరాజు శనివారం సాయంత్రం ఈ సంఘటనకు సంబంధిత కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఆ సాయంత్రం క్వారీ యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ కొలిక్కి రాలేదు. ఇదే విషయమై ఆదివారం ఎస్‌.కోట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకుని క్వారీ యజమాన్యం మృతుడి కుటుంబానికి కనీస నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చర్చలు జరపగా పరిహారానికి క్వారీ యజమాన్యం స్పందించిందని గంగరాజు పేర్కొన్నారు.పరిహారం చెల్లించడమే కాకుండా కుటుంబానికి ఇన్సురెన్సు, తదితరవి అందించి ఆదుకోవాలని కోరారు.లేబర్‌ చట్టం ప్రకారం ఇన్సూరెన్స్‌ అందే వరకు నెల కూలిలో సగం కూలి చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ఇదిలా ఉండగా కుటుంబ పోషణం కోసం కూలి పని కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. క్వారీ యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ జి నరసన్న, సిపిఎం మండల నాయకులు ఎస్‌.నాగులు, జి.దేవన్న, టిడిపి నాయకులు ఎస్‌.దొన్ను, కృష్ణ, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.