Apr 02,2023 22:57

ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్‌ : పాయకాపురం చెరువులో పడి మృతిచెందిన బాలుడు దుర్గాప్రసాద్‌ మృతికి ప్రభుత్వం, నగరపాలక సంస్థ బాధ్యత వహించాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు డిమాండ్‌ చేశారు. బాలుడు మృతిచెందిన చెరువు ప్రాంతాన్ని సిహెచ్‌.బాబురావు, ఇతర నాయకులు కలసి ఆదివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మతిచెందిన దుర్గాప్రసాద్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో పాయకాపురం చెరువు అభివధ్ది, పార్కు నిర్మాణం పనులు చేపడుతూ తగు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయమన్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయకపోవడం, తగు రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని, ఇప్పటికైనా నగరపాలక సంస్థ తగు రక్షణ ఏర్పాట్లు చేసి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన దుర్గాప్రసాద్‌ తండ్రి వికలాంగులు, మాట్లాడలేడు, వినపడదు, అక్క ఆరోగ్యం సక్రమంగా ఉండదని, కష్టాల్లో ఉన్న ఈ కుటుంబం కుమారుడిని కోల్పోవడం బాధాక రమన్నారు. ఈ కుటుంబం పరిస్థితిని దష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణారావు, నేతలు సిహెచ్‌. శ్రీనివాస్‌, నాగరాజు, శ్రీరామ్‌, శివ పాల్గొన్నారు.
బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన బోండా ఉమామహేశ్వరరావు
మృతిచెందిన బాలుడి కుటుంబాన్ని తెలుగు దేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యులు, సెంట్రల్‌ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు ఆదివారం పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చారు. స్థానిక టిడిపి కార్పోరేటర్‌, టిఎన్‌టియుసి నాయకులు, టిడిపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.