Nov 21,2023 00:04

అంత్యక్రియలకు స్థలం చూపించాలని తహశీల్దార్‌ కార్యాలయ ముట్టడి
శ్మశానవాటికలో ఆక్రమణదారుడు అడ్డుకోవడంతో నిరసన
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఆందోళన
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి: శ్మశాన వాటికలో మృతదేహాన్ని కననం చేయడానికి భూ ఆక్రమణదారుడు అడ్డుకోవడంతో గ్రామస్తులు సోమవారం మృతదేహంతో తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. మండలంలోని కమ్మనపల్లి గ్రామంలో ఉన్న శ్మశాన వాటికను ఆక్రమించుకొని దౌర్జన్యంతో కననం చేయనీయడం లేదంటూ ఆ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. అక్కడి అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మృతదేహాన్ని బైరెడ్డిపల్లి-పుంగనూరు రహదారి వద్దకు తరలించి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సమస్యపై గ్రామస్తులతో చర్చించారు. శ్మశాన స్థలంలో మృతదేహాన్ని కననం చేసేందుకు అనుమతిస్తేనే కదులుతామని కరాకండిగా చెప్పడంతో పోలీసులు రెవెన్యూ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఎట్టకేలకు కదిలిన రెవెన్యూ యంత్రాంగం శ్మశాన వాటిక స్థలంలో మృతదేహాన్ని కననం చేసేందుకు ఆక్రమణదారుడిని ఒప్పించారు. దీంతో సమస్య సద్ధుమనిగింది.