మైనర్ బాలికపై అత్యాచార కేసు విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే వ్యవహరించిన తీరు అత్యంత విచారకరం! ఈ విచారణ సందర్భంగా ఆయన వేసిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు అమానవీయమైనవి. నాగరిక సమాజం ఏ మాత్రం హర్షించనివి! అత్యాచారం చేసిన వ్యక్తిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. మరొకరు అటువంటి దారుణాలకు తెగబడకుండా చూడాలి! కానీ, జరిగిందేమిటి? 'ఆమెను నీవు పెళ్లి చేసుకుంటావా?' అని నిందితుడిని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీని అర్ధం ఏమిటి? పెళ్లి చేసుకుంటే నేరం, నేరం కాకుండా పోతుందా? రేపొద్దున ఎవరైనా దారిన పోయే యువతిపై అమానుష కాండకు తెగబడి ఆ తరువాత పెళ్లి చేసుకుంటానంటే సరిపోతుందా? ఆ మాట చెప్పగానే కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలా? 16 సంవత్సరాల మైనార్టీ తీరని పసిమొగ్గను 12 సార్లు అమానుషంగా చిదిమేసిన నరరూప రాక్షసుడి పట్ల భారత అత్యున్నత న్యాయస్థానం ఈ ఔదార్యం చూపదల్చుకుందన్న సంగతి తెలిస్తే గుండెలవిసిపోతున్నాయి. అంతర్జాతీయంగా నాగరిక సమాజంలో మన న్యాయ వ్యవస్థ ప్రతిష్ట మసకబారడం మాత్రమే కాక, మన ఆడబిడ్డలకు న్యాయస్థానాల్లో న్యాయం దక్కుతుందన్న విశ్వాసమే పోతోంది. ప్రభుత్వంపై చిన్నపాటి విమర్శ చేసినా అంతర్జాతీయంగా పరువు పోతుందంటూ గగ్గోలు పెట్టే ఘనత వహించిన కేంద్ర పాలకులు ఈ విషయంలో మాత్రం నోళ్లు మెదపడం లేదు. ఈ తరహా వ్యాఖ్యల కారణంగా సభ్య దేశాల్లో పలుచనై పోయే దేశ పరువు ప్రతిష్టల విషయమై వారికి చీమకుట్టినట్టు కూడా లేదు. 18 సంవత్సరాల వయసుకు చేరిన బాధిత యువతిని 'నీపై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా..' అని అడగాలన్న కనీస ఆలోచన న్యాయమూర్తికి రాలేదెందుకో! ఇన్ని సంవత్సరాలు ఆమె పడ్డ ఆవేదన, బాధ, అనుభవించిన కష్టాలు, కన్నీళ్లకు ఆ మాత్రపు విలువ లేదా? ఆమె అభిప్రాయాన్ని అసలు పట్టించుకోరా... ఇదెక్కడి న్యాయం? నిందితుడు ప్రభుత్వ ఉద్యోగా, ప్రైవేటు ఉద్యోగా, వ్యాపారా, రాజకీయవేత్త అన్న దాంతో ప్రమేయం ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ప్రస్తావించి, మరీ ఔదార్యాన్ని ప్రదర్శించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో? అదేరోజు మరో కేసులో 'చట్టబద్దంగా వివాహమైన తరువాత భార్యకు ఇష్టం లేకుండా లైంగిక కార్యం జరిపినంతమాత్రన అత్యాచారమనాలా... అలా ఎలా అంటాం' అని ప్రధాన న్యాయమూర్తిగారే ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా నిందితుడి అరెస్ట్ పైనా స్టే ఇచ్చారు. అంటే, వివాహమైన తరువాత భార్య భర్త ఆస్తిగా మారిపోతుందని, ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదని, భర్త ఏం చేసినా, ఎలా చేసినా చిరునవ్వుతోనే భరించాలనే గదా ఆయన సెలవిస్తున్నారు! ఇన్ని అధికారాలు దఖలు పడతాయనే మొదటి కేసులోనూ పెళ్లి చేసుకోవాలని సూచించారా? ఇది న్యాయమవుతుందా... పచ్చి పురుషాహంకారమవుతుంది కానీ!
నిజానికి వైవాహిక బంధంలోనూ ఇష్టంలేని శృంగారాన్ని అత్యాచారంగా గుర్తించాలని, ఆ మేరకు చట్టం తీసుకురావాలని మహిళా సంఘాలు, అభ్యుదయ కాముకులు ఎన్నో ఏళ్ల నుండి పోరాడుతున్నారు. మన దేశంలో ఆ చర్యలు తీసుకోలేదుకానీ, ఇప్పటికే 50 దేశాల్లో దీనిని అత్యాచారంతో సమానమైన నేరంగా గుర్తించారు. భారత్‌తో పాటు మరో 36 దేశాలు మాత్రమే ఈ తరహా చట్టాలు చేయడానికి ఇప్పటికీ వెనకాడుతున్నాయి. ఎన్నో పోరాటాల తరువాత వచ్చిన గృహహింస నిరోధక చట్టంలోనూ దీనిని లైంగిక హింసగానే చూపారు. ఆ మేరకు నిరూపించడం కూడా ఆచరణలో కష్టంగా మారుతోంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి సెకనుకు ముగ్గురు భారతీయ మహిళలు తమ భర్తల చేతిలో లైంగిక దాడికి గురవుతున్నారు. ప్రతి ముగ్గురు పురుషుల్లోనూ ఒకరు ఏదో సమయంలో తమ భార్యను తాము బలవంతంగా అనుభవించినట్టు గొప్పగా చెప్పుకుంటున్నారు. మగతనానిని చిహ్నంగా వారు దీనిని భావిస్తున్నారు. దీనికి కారణమూ తరతరాలుగా వెంటాడుతున్న పురుషాహంకార భావజాలమే! ఈ పరిస్థితి మారాలి. భర్తకు భార్యపై అఘాయిత్యం చేయడానికి అవకాశమిచ్చే ఇండియన్ పీనల్ కోడ్ లోని దుర్మార్గమైన 375వ సెక్షన్‌ను రద్దు చేయాలి. మానవ హక్కులన్నీ .. మహిళల హక్కులే! మహిళల హక్కులన్నీ ఏ మాత్రం మినహాయింపు లేకుండా భార్యలకూ వర్తిస్తాయి. ఆమెకూ ఓ శరీరముంది.. దానికి బాధ, నొప్పి తెలుస్తుంది! ఆమెకూ ఓ మనస్సుంది. ఆ మనసుకూ స్పందనలు ఉంటాయి. భార్య అయినంత మాత్రాన అవన్నీ ఉండవని, భర్త చేతిలో ఆటబొమ్మగా మారుతుందని అనుకోవడం తప్పు! సమాజంలోని సగటు వ్యక్తి అయినా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, ఇటువంటి బూజు పట్టిన భావాలను వదులుకోవాల్సిందే! మానవత్వమున్న ప్రతి వ్యక్తీ ఈ బూజును వొదలగొట్టేందుకు, మన మాతృమూర్తుల రుణం తీర్చుకునేందుకు ఉద్యమించాల్సిందే!










