Jul 09,2023 21:15

ఏనుగులు ధ్వంసం చేసిన డ్రిప్‌ పంపులు

ప్రజాశక్తి- గరుగుబిల్లి :  మండలంలో గడిచిన ఐదురోజుల గొట్టివలసలో తిష్ట వేసిన ఏనుగులు ఆదివారం మరుపెంట గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. దాదాపు నాలుగు రోజులుగా గొట్టివలస పరిసరాల్లో తిష్ట వేసిన ఏనుగులు నాటు బళ్లు, ట్రాక్టర్‌ తొట్టె, తౌడు బస్తాలుతో పాటు ఇంటి కిటికీలను ధ్వంసం చేశాయి. శనివారం రాత్రి ఈ ప్రాంతం నుంచి మరుపెంట తరలి వెళ్లాయి. అయితే మరుపెంట తరలి వెళ్లిన ఏనుగులు ఎంపిపి ఉరిటి రామారావు పొలంలో ఇటీవల వేసిన డ్రిప్‌ సిస్టంతో పాటు దాదాపు అరఎకరా పొలంలో వేసిన పామాయిల్‌ మొక్కలను ధ్వంసం చేశాయి. ఏనుగులు డ్రిప్పు సిస్టంను ధ్వంసం చేయడంతో అవి ఎందుకూ పనికి రాకుండా పోయిందని ఎంపిపి తెలిపారు. డ్రిప్‌ సిస్టంతో పాటు పామ్‌ ఆయిల్‌ మొక్కలను ధ్వంసం చేసిన విషయం అటవీ శాఖఅధికారులకు తెలిపినా తాము ఏం చేస్తామని సమాధానం చెబుతున్నారని ఎంపిపి తెలిపారు. సుమారు రూ.4లక్షలు వరకూ నష్టం వాటిల్లిందన్నారు. తక్షణమేఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.