దశాబ్దాల వయసున్న మహావృక్షాలు కొమ్మలు ఒరిగి, మానులు తిరిగి, ఊడలు పెరిగి ఒక చిన్నపాటి కుండీల్లో ఒదిగి ఉంటే.. ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. అలాంటి అరుదైన మొక్కలనే వామన వృక్షాలు, మరుగుజ్జు వృక్షాలు, బోన్సాయ్ ప్లాంట్స్ అని పిలుస్తారు. వీటిలో వందల సంవత్సరాల వయసున్న మొక్కలూ ఉంటాయి. లక్షల విలువచేసే మరుగుజ్జు మొక్కల గురించి తెలుసుకుందాం.
జపాన్, చైనా దేశాల సంస్కృతులు నుంచి ఈ మొక్కలు పుట్టుకొచ్చాయి. వీటిలో కాయలు కాసేవి, పువ్వులు పూసేవి ఉంటాయి. అలంకారప్రాయంగా ఉపయోగించే ఈ చిట్టి మొక్కలు ధరలోనూ గట్టే. పట్టుమని 20 అంగుళాలు పొడవు ఉండని ఈ బోన్సారు మొక్కల్లో 20 లక్షల రూపాయల విలువ చేసేవీ ఉన్నాయి. వీటిని ఐశ్వర్యవంతుల నజరానా అని కూడా పిలుస్తుంటారు.
నియంత్రిత వాతావరణ పరిస్థితులలో....
బోన్సాయ్ మొక్కల్ని ప్రత్యేకమైన నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో ఉత్పత్తి చేస్తారు. రావి, మర్రి, జువ్వి, చింత, సైకస్ సరుగుడు వంటి వృక్షజాతి మొక్కల్ని ముందుగా ఎంచుకోవాలి. వాటిని చిన్న కుండీలలో వేసి కొద్దిగా మట్టి, కొంచెం నీరు పోస్తూ.. కొమ్మలను కావాల్సిన విధంగా మలుస్తూ, కత్తిరిస్తూ ఉండాలి. వీటిని పదుల సంవత్సరాలు పెంచుతారు. కానీ మొక్కకు కావాల్సినంత పోషక విలువలు అందక గిడస బారిపోతుంది. వీటినే బోన్సాయ్ మొక్కలు అంటారు.
పైకాస్ బోన్సాయ్
భారత్‌లో ఎక్కువగా తయారు చేసే బోన్సాయ్ మొక్కలు పైకాస్ బోన్సాయ్. ఆకుపచ్చటి దళసరి పత్రాలతో ఈ మొక్క ఎంతో అందంగా ఉంటుంది. ఆకులు ప్లాస్టిక్ గ్లేజింగ్‌తో మెరుస్తూ ఉంటాయి. మొక్కకి నిండుగా ఆకులుంటాయి. ఈ మొక్క దాదాపు వంద రకాలలో లభ్యమవుతుంది. దీనికి రోజూ కొద్ది కొద్దిగా మాత్రమే నీళ్లు పోయాలి. అంటే వారానికి ఒకసారి ఆకుల మీద నీళ్లు చిలకరించాలి.
డూమ్ బోన్సాయ్
చైనాకు చెందిన వెరైటీ మొక్క డూమ్ బోన్సాయ్. ఇది గోపురాకారంగా ఉంటుంది. ఈ మొక్కకు కాండం హైలెట్. అది వంపులు తిరిగి ముదురు మానుల్లా కనిపిస్తుంది. చాలా నెమ్మదిగా ఎదిగే మొక్క ఇది. ఆకులు చిన్న చిన్న కేసరాలు మాదిరిగా మెరుస్తూ లేత ఆకుపచ్చ రంగులో కనువిందు చేస్తాయి. అడుగుభాగంలో ఉండే మట్టి మీద ఆకుపచ్చని లాన్ మొక్కకు మరింత అందం అద్దుతుంది.
జంగిల్ బోన్సాయ్
ప్రపంచంలో అతివిలువైన బోన్సాయ్ మొక్క ఇది. ఒక చిన్న కుండీలో ఏకంగా మరుగుజ్జు మొక్కలతో అడవే కనిపిస్తుంది. పింగాణీ కుండీల్లో కాకుండా చెట్టు తొర్రనే కుండీగా మలచి ఈ మొక్కను పెంచడం విశేషం. పైకి చాలా మొక్కలు సముదాయంలా కనిపిస్తాయి. కానీ మట్టిలో వీటన్నింటి మొదలు కలిసి ఒకటిగానే ఉంటుంది. ఇవి ఫైన్‌జాతి మొక్కలు.
బోగన్విలియా బోన్సాయ్
బోగన్విలియా పూల జాతికి చెందిన మరుగుజ్జు మొక్కను బోగన్విలియా బోన్సాయ్ అంటారు. మనం తెలుగులో దీన్ని కాగితపు పూల మొక్క అంటాము. ఈ మొక్క గులాబి రంగుపూలను నిండుగా పూస్తుంది. సాధారణ బోగన్విలియా మొక్కకు ముళ్లుంటాయి. దీనికి మాత్రం ముళ్లు అస్సలు ఉండవు. దీని కాండం ఒంపు తిరిగి, అందంగా ఉంటుంది.
ప్లేట్ బోన్సాయ్
ఒంపులు తిరిగిన కాండానికి చిన్న చిన్న ప్లేట్లు మాదిరిగా ఉండే కొమ్మలు ఒయ్యారాలు ఒలకబోస్తూ మదిదోస్తాయి. ఈ ప్లేట్ బోన్సాయ్ మొక్క మొదల్లో రంగు రంగు చలువరాళ్లు వేస్తే మరింత శోభనిస్తుంది.
ఎసెర్ పలమాటం ముల్టీ బోన్సాయ్
ఎసెర్ పలమాటం అనేది జపాన్ దేశపు మొక్క. ఆముదం మొక్క ఆకుల్లాంటి చిన్ని చిన్ని పత్రాలు మొక్క నిండా కొలువుదీరి ఎంతో ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి అనేక రంగుల్లో, చాలా రకాల్లో దొరుకుతాయి. ఈ మొక్కలతో తయారైన విభిన్న రంగుల కలబోతతో ఉండే బోన్సారు మొక్కే ఎసెర్ పలమాటం ముల్టీ బోన్సాయ్.
సచ్చేనియం బోన్సాయ్
చిన్ని చిన్ని పత్రాల కూడలితో ఒక పెద్ద ఆకు, అలాంటి ఆకుల కూడలితో కొమ్మా ఉంటాయి. చిలకాకు పచ్చరంగుతో ఆకులు కాంతివంతంగా ఉంటాయి. వెడల్పాటి కాండం, గుబురుగా ఉండే ఈ మొక్క చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది.
అరౌకారియా స్తంభాల బోన్సాయ్
అరౌకారియా మొక్క నిట్టనిలువుగా చాలా పొడవు స్తంభాల మాదిరిగా ఎదుగుతుంది. ఇవి సముద్రాల్లో ఉండే పగడపు దిబ్బల మీద పెరుగుతాయి. వీటిని సేకరించి, తయారుచేసిన బోన్సారు మొక్కలే అరౌకారియా స్తంభాల బోన్సాయిలు. ఇవి అరౌకారియాసి కుటుంబంలో కోనిఫెర్ జాతి. ప్రపంచమంతటా వీటికి గిరాకీ ఉంది.
చైనీస్ బనియన్ హట్ బోన్సాయ్
నిజానికి బోన్సాయ్ మొక్కలన్నీ చిన్నిపాటి వృక్షాలే. చైనీస్ బనియన్ గుబురుగా ఆకులుండే మొక్క. ఇది ఏకరీతిగా కాకుండా కొమ్మకో ఆకుల గుచ్చం పళ్ళాల్లాగ ఉంటుంది. మొక్క తలభాగం గుడిసె పైకప్పు ఆకారంలో ఉండటంతో చైనీస్ బనియన్ హట్ బోన్సాయ్ అని పిలుస్తారు.
- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506