ఒక విషాదం
సృష్టించిన విధ్వంసపు
కన్నీటి చారికలింకా ఆరకముందే
మరెన్నో ఆర్తిగీతాలు !
ఒకరికి.. చిట్టచివరి వీడ్కోలిచ్చి
ముంగిట్లోకి వచ్చేలోపే
మరణ దేవత..
కసాయిగా తలుపు తట్టి
మరో పెనువిషాదాన్ని సృష్టిస్తుంది!
ప్రపంచమంత
ద్ణుఖ జాతిగీతం పాడుతుంది
అవని కొమ్మకొమ్మకు
ఆగని కన్నీటి చెమ్మే కురుస్తుంది!
గాలితిత్తుల్ని
గట్టిగ సుట్టి కట్టేసినట్లు
శ్వాస అసలే ఆడని
మాటలసలే రాని
అవ్యక్త మృత్యు సంవేదనలు!
మాతృశోకం..
పితృశోకం..
పుత్రశోకం..
బంధుశోకం..
మిత్రశోకం..
శోకమే మా'నవ' జీవన శ్లోకం!
మట్టిపై మనుగడ పెద్ద క్లేశం !!
ఇప్పుడు ధరిత్రి..
ఏరోజుకారోజు క్రమం తప్పక
శవపత్రంలో అంకెల్ని
నమోదు చేస్తున్న మరుభూమి !
- అశోక్ అవారి
90005 76581