ప్రజాశక్తి- కంచరపాలెం : జివిఎంసి 57వ వార్డు, మర్రిపాలెం శ్యామ్‌నగర్ కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న గెడ్డ సమస్య పరిష్కారంపై అధికారుల్లో కదలిక వచ్చింది. స్థానికుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు సమస్యపై పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.గణబాబు సంబంధిత రైల్వే జిఎం, డిఆర్‌ఎంలతోపాటు జివిఎంసి అధికారుల దృస్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. గురువారం ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో రైల్వే, జివిఎంసి అధికారులు శ్యాంనగర్ గెడ్డ సమస్యను స్వయంగా పరిశీలించారు. గెడ్డ వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను మరోమారు ఎమ్మెల్యే గణబాబు అధికారులకు విన్నవించగా, వారు స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అలాగే ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే గణబాబు సూచించారు. కార్యక్రమంలో 57వ వార్డు అధ్యక్షుడు పెంటకోట అజరువాబు, నారాయణ, చిన్న, శ్రీను, స్థానిక మహిళలు పాల్గొని, గెడ్డ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యే గణబాబుకు ధన్యవాదాలు తెలిపారు.










