
ప్రజాశక్తి - రాజానగరం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి ఓటు వేసి గెలిపించుకుందామని ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు. మండలంలోని దివాన్ చెరువు ఎంఎఫ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జక్కంపూడి రాజా మాట్లాడారు. 2014 ఎన్నికల ముందు 650 హామీలు ఇచ్చి బిజెపి, జనసేన పార్టీల పొత్తుతో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ఆఖరికి తన ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచే తొలగించారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో సిఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఎంఎల్‌సి వంకా రవీంద్ర మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో మన రాష్ట్ర జిడిపి స్థానం 22వ స్థానంలో ఉంటే నేడు అది మొదటి స్థానంలోకి రావడం జరిగిందని, గతంలో 13,000 చిన్న తరహా పరిశ్రమలు ఉంటే, నేడు 2.50 లక్షలకు చేరుకుందన్నారు. రాజమహేం ద్రవరం అర్బన్ నియోజకవర్గ వైసిపి కో-ఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య విధానంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు దూలం పెద్ద, గంగిశెట్టి సోమేశ్వరరావు, వేమగిరి కృష్ణ పాల్గొన్నారు.