Oct 21,2023 20:47

వేదికపై ఎమ్మెల్యే కడుబండితో వైవిసుబ్బారెడ్డి, మంత్రి బొత్స మాటామంతి

 ప్రజాశక్తి - జామి :  'వచ్చే ఎన్నికల్లో మరోసారి కడుబండిని గెలిపించండి. పార్టీ అదేశాలు శిరసావహించండి' అని వైసిపి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈనెల 26నుంచి తలపెట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు వైసిపి విస్తృత సమావేశం శనివారం లక్కవరపుకోటలో జరిగింది. ముఖ్యఅతిథులుగా వైవి సుబ్బారెడ్డితో పాటు రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్య నారాయణ,పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లో మమేకమై నిత్యం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయడంలో ఎమ్మెల్యే కడుబండి చేసిన కృషిని అభినందించారు. రానున్న మూడునెలల్లో పార్టీ నిర్వహించనున్న కార్యక్రమాలను వివరించారు. వాటిలో ప్రధానంగా ' వై ఎపి నీడ్స్‌ జగన్‌, సాధికార బస్సు యాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ, అందరికీ అందుబాటులో ఉన్న కడుబండి శ్రీనివాసరావును రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయనకే పార్టీ టిక్కెట్‌ కేటాయించిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాలను మాత్రమే తాను ప్రకటిస్తున్నానని చెప్పారు. వైవి సుబ్బారెడ్డి ప్రకటనతో ఎమ్మెల్యే కడుబండికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ విషయంలో లైన్‌ క్లియర్‌ అయ్యింది. నియోజకవర్గం లో వైసిపి శ్రేణుల్లో ఉన్న గందరగోళానికి దాదాపుగా తెర పడింది. కార్యకర్తలంతా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. వైవి ప్రకటనకు తోడుగా బొత్స పార్టీ అదేశాలు శిరసావహించాలని చెప్పారు. ఎమ్మెల్సీ రఘురాజు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.