Sep 26,2023 00:19
భట్టిప్రోలు విఠలేశ్వర కాలనీలో రహదారిపై నిలిచిన నీరు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు విఠలేశ్వర నగర్‌ కాలనీ మరోమారు ముంపునకు గురయింది. గ్రామంలో కాలనీకి చుట్టుపక్కల కురిసే వర్షపునీరు ఈ కాలనీకే చేరుతోంది. అసలే లోతట్టు ప్రాంతం, దానికి తోడు కాలనీ పక్కగా వెల్లటూరు ఛానల్‌ సాగునీటి కాలువ కూడా పారుతుండటంతో కాలనీకి ఊటనీరు దిగి మరింత ముంపునకు గురవుతోందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీ ఏర్పడి సుమారు 25 సంవత్సరాలు గడుస్తోంది. అప్పట్నుం చి పూర్తి స్థాయిలో మెరకలు గాని, రహదారులు గాని లేక పోవటం వలన ఏటా ఏ కొద్ది వర్షం కురిసినా ముంపునకు గురై కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందుల ను ఎదుర్కొంటున్నారు. ఈ యేడాది ఇప్పటికే మూడుసార్లు వర్షానికి ముంపుకు గురికాగా ప్రస్తుతం సాగునీటి కాలువ వలన నీరు చేరి రహదారులు మునిగిపోవడమే కాక గృహాలను సైతం చుట్టుముట్టిందని వాపోతున్నారు. కాలనీకి సమీపంలో ఉన్న పంచాయతీ చెరువుకు కాలువ నుంచి నీటిని పెట్టుకునేందుకు తూములు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. గత వర్షానికి నిలువ ఉన్న నీటిని మంత్రి నాగార్జున చొరవతో వెల్లటూరులో ఉన్న కాలువ లాకులు బిగించి కాలనీలో నీటిని కాలువలోకి మళ్లించారు. కానీ ఆ కాలువలో ఉన్న తూములు బిగించకపోవడం వలన కాలువలకు నీరు ఉధృతంగా పారటంతో తూముల ద్వారా సాగునీరు చేరి కాలనీ ముంపునకు కారణమైందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాక పంచాయతీ చెరువును చేపల కోసం పాట పాడుకున్న లీజుదారుడు కూడా చెరువుకు ఏర్పాటు చేసిన కాలువ తూములను ఎప్పటికప్పుడు సరి చూసుకోకుండా వదిలివేయడం వలన వర్షం లేకపోయినా కాలనీ మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్న ఈ కాలనీలో రహదారులు సైతం నీటిలో మునిగిపోవటం వలన నీటి ద్వారా పాములు గృహాల్లోకి ప్రవేశిస్తున్నాయని, స్కూలు పిల్లలు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు చొరవ తీసుకొని కాలనీని ముంచెత్తిన నీటిని బయటకు మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరుచున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ కాలనీకి రహదారులు ముంపునకు గురయ్యాయని, సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని అన్నారు.