Jun 02,2023 23:27

మృతుడు సాయిసందీప్‌ (ఫైల్‌)

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ : హత్య కేసుపై వివాదం మరో హత్యకు దారితీసిన ఘటన మండలంలోని నవులూరులో శుక్రవారం చోటుచేసుకుంది. గత నెల 29న తేదిన ఇదే గ్రామంలో ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో రెండేళ్ల చిన్నారి అయిన లక్ష్మీ పద్మావతిని నేలకేసి కొట్టి హతమార్చిన కేసులో నిందితుడైన తండ్రి మునగాల గోపి పోలీసుల కస్టడిలో ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఎమ్మెస్సెస్‌ కాలనీలో చిన్నారి సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడు గోపి తరుపు బంధువులు వచ్చి మృతురాలి తల్లి మౌనికతో మాట్లాడి కేసులో రాజీకి రావాలని ఒత్తిడి చేశారు. రాజీకి రాకుంటే ఇల్లు ఖాళీ చేయాలని, ఆ ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో గోపిని బయటకు తెస్తామని బెదిరించారు. దీంతో మౌనిక చిన్నమ్మ కొడుకైన ఆత్మకూరుకు చెందిన వరహాల సాయిసందీప్‌ (24) కలుగజేసుకున్నాడు. మాటామాటా పెరిగి తోపులాట జరగడంతో ఒకరి తలకు దెబ్బతగిలి రక్తం వచ్చింది. సాయిసందీప్‌పైకి మునగాల వెంకటకృష్ణ, శివనారాయణ కత్తులు తీసుకుని దాడికి వచ్చారు. దీంతో భయపడిన సాయి సందీప్‌ పరుగులు తీయగా మిగతా ఇద్దరు వాహనంపై వెంబడించి ఎసిసి క్రికెట్‌ స్టేడియం సమీపంలో పట్టుకుని పీక కోసి దారుణంగా హతమార్చారు. అనంతరం అక్కడి నుండి పరారయ్యారు. ఇది తెలిసిన డీఎస్సీ రాంబాబు, ఇతర పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.