ప్రజాశక్తి - యంత్రాంగం
ఎంవిపి.కాలనీ : 75 ఏళ్ల స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ బారి నుంచి కాపాకుంటామని సిఐటియు జిల్లా కార్యదర్శి పి.మణి అన్నారు. ఆదివారం సాయంత్రం 18వ వార్డు అంజయ్య నగర్‌లో సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆమె మాట్లాడారు. మోడీ ప్రభుత్వం సామాన్యులు వాడే వస్తువులన్నింటిపైనా జిఎస్‌టి భారాలు మోపిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తోందని అన్నారు. కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చి లేబర్ కోడ్స్‌ను తెచ్చిందన్నారు. కార్యక్రమంలో నాయకులు కోదండ, వెంకటరావు, కుమారి, చంటి, గీత, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు. జగదాంబ, ఆరిలోవ, మధురవాడ, కంచరపాలెం, గాజువాక, మల్కాపురం, గోపాలపట్నం, ఉక్కునగరం ప్రాంతాల్లోనూ జనజాగరణ కార్యక్రమాలు జరిగాయి.
భీమునిపట్నం : స్థానిక బ్యాంక్ కాలనీ, ఎల్లమ్మపేటలో ఆదివారం రాత్రి సిఐటియు, ఐద్వా భీమిలి జోన్ కమిటీ ఆధ్వర్యాన జన జాగరణ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు దేశభక్తి గీతాలు పాడారు. వివిధ దేశ నాయకుల వేషధారణలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి, ఐద్వా నాయకులు పాల్గొన్నారు.










