Nov 12,2022 23:55

మాట్లాడుతున్న అప్పలరాజు

ప్రజాశక్తి-నక్కపల్లి:విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను మోసం చేసారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు తెలిపారు. విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా లక్షల మంది ప్రజలను సమీకరించి సభ జరిపారని, ఈ సభలో నరేంద్ర మోడీ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిలుపుదల, ప్రత్యేక హౌదా, రైల్వే జోన్‌, విభజన చట్టంలో హామీలు, పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు కేటాయింపులు చేస్తారని ఆశించామని, వీటిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పేలవంగా ప్రస్తావించారన్నారు. వీటిపై ప్రధాన మంత్రి ఏమీ మాట్లాడకుండా గతంలో ప్రకటించిన పాత ప్రోజెక్టులకు శంఖుస్థాపన చేశారని విమర్శించారు.ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని లక్షలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి ఎందుకు దాసోహం చేసారో, ఈ సభ ద్వారా రాష్ట్రానికి ఏం సాధించారో సమాధానం చెప్పాలన్నారు. 10 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు సాధించి 3 లక్షల 30 వేలు కోట్ల విలువ చేసే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడకపోవడమా సాధించిన ఘనత అని ప్రశ్నించారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హౌదా, స్టీల్‌ ప్లాంట్‌పై ుుందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.రాజేష్‌, నేతలు రాయుడు, కనకారావు, రమణ పాల్గొన్నారు.