- 10కి పెరిగిన రాజీనామాలు
- బిజెపిని తుడిచిపెడతామన్న మౌర్య
- ముందుగా ఊహించినవేనన్న బిజెపి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో వరుసగా మంత్రులు, వెనుకబడిన వర్గాల నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మరో మంత్రి, వెనుకబడిన వర్గాల నేత ధరమ్ సింగ్ సైనితో సహా నలుగురు ఎంఎల్‌ఎలు రాజీనామా చేశారు. ఎన్నికలు ఇంకా నెల రోజులు కూడా లేని తరుణంలో గత మూడు రోజుల్లో ముగ్గురు మంత్రులుసహా పదిమంది బిజెపిని వీడారు. వీరందరూ సమాజ్‌వాదీ పార్టీలో చేరతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బిజెపిని వీడుతున్నట్లు అంతకుముందు వచ్చిన వార్తలను ఖండిస్తూ తొలుత సైనివీడియో విడుదల చేశారు. 24 గంటలు కూడా గడవకముందే రాజీనామా చేశారు. షహరాన్‌పూర్ జిల్లాలోని నకుడ్ నుంచి నాలుగుసార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికైన ధరమ్ సింగ్ సైని ఒబిసిల్లో కీలక నేత. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల్లో ఆయనకు మంచిపట్టు వుంది. శుక్రవారం రాజీనామాలు చేసినవారిలో లఖింపూర్ ఖెరి ఎంఎల్‌ఎ బాలా ప్రసాద్ అవస్థి, షెరావస్తి ఎంఎల్‌ఎ రామ్ ఫెరాన్ పాండే ఉన్నారు. వీరిద్దరు బ్రాహ్మిన్ నేతలు. ప్రభుత్వం తనకు ఇచ్చిన ఇంటిని, సెక్యూరిటీని కూడా సైని అప్పచెప్పారు. ఇప్పటివరకు ఆరుగురు రాజీనామాలు చేసిన తీరులోనే సైని రాజీనామా కూడా వెలువడింది.
అంతకుముందే మరో వెనుకబడిన వర్గాల నేత, షికోహాబాద్ ఎంఎల్‌ఎ ముకేష్ వర్మ ట్విట్టర్‌లో బిజెపికి రాజీనామా చేస్తూ, ఆ లేఖను పోస్ట్ చేశారు. వెనుకబడిన వర్గాలు, దళితుల పట్ల ప్రభుత్వానికి గౌరవమే లేదని ఆయన విమర్శించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్‌కు లేఖ రాశారు. మౌర్య నాయకత్వాన న్యాయం కోసం పోరాడతామని చెప్పారు.
20 వరకు ప్రతిరోజూ బిజెపికి ఎదురుదెబ్బలే.. !
ఈ నెల 20 వరకూ ప్రతిరోజూ బిజెపికి ఎదురుదెబ్బలు తప్పవని యోగి కేబినెట్‌కి రాజీనామా చేసిన ధరమ్‌సింగ్ సైనీ అన్నారు. రోజూ ఒక మంత్రి, ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుంటారని చెప్పారు. తమని బిజెపి సీనియర్ నేతలు పక్కన పెట్టారని, చెప్పినా వినేవారు లేరని అన్నారు. గతంలో 140 మంది ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టినపుడు కేంద్రం తమను బెదిరించిందని, దీంతో సరైన సమయంలో వారికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. రాజీనామా అనంతరం సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్‌తో సమావేశమయ్యానని తెలిపారు. ఎస్‌పిలో చేరుతునాురా అను ప్రశ్నపై స్పందిస్తూ.. శుక్రవారం తదుపరి చర్చ జరుగుతుందని.. అనంతరం నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
వారందరూ మౌర్య అనుచరులే
వర్మతో సహా ఈ మూడు రోజుల్లో రాజీనామాలు చేసిన వారు స్వామి ప్రసాద్ మౌర్య అనుచరులేనని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ముందుగానే ఊహించినవేనని, ఇలాంటి వాటి వల్ల బిజెపిపై ఎలాంటి ప్రభావం వుండదని పేర్కొన్నాయి. మంత్రులతో సహా మరో పది మంది నేతలు కూడా ఇదే బాటలో ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి.
పాము-ముంగిస సామ్యం! : స్వామిప్రసాద్ మౌర్య
రాజీనామాల పర్వానికి శ్రీకారం చుట్టిన స్వామి ప్రసాద్ మౌర్య తన రాజకీయ ఎత్తుగడలను పాము-ముంగిసలతో పోల్చారు. ''ఆర్‌ఎస్‌ఎస్ తాచుపాము వంటిది, బిజెపి పాములాంటిది, కానీ స్వామి ప్రసాద్ మౌర్య ముంగిస. మొత్తంగా అందరినీ తుడిచిపెట్టేవరకు పోరాటం ఆపదు.'' అని వ్యాఖ్యానించారు. బిజెపికి పతనం ఆరంభమైందని నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రకటించారు. పార్టీని కిందకు లాగేసే వారిలో తాను ఒకడిగా వుంటానని అన్నారు. దళితులు, నిరుద్యోగులు, రైతులు, అట్టడుగువర్గాల హక్కులన్నింటినీ బిజెపి లాక్కుంటోందని విమర్శించారు. మంగళవారం మొదటిసారిగా మౌర్య రాజీనామా చేసిన తర్వాత ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు సహా పదిమంది నేతలు రాజీనామా చేశారు. ఆదిత్యనాథ్ నాయకత్వం గురించి గతంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేశామని, కానీ పార్టీ స్పందించలేదని మౌర్య అన్నారు.










