మరో చారిత్రాత్మక ఉద్యమానికి సిద్ధంకండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - విజయవాడ : ప్రజాస్వామ్య హక్కులు, ప్రజా రక్షణకు మరో చారిత్రాత్మక పోరాటం నిర్వహించాల్సిన సమయం వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గతంలో ఎమర్జెన్సీ కాలంలో నాయకులను జైళ్లలో పెట్టినప్పుడు, 1984లో ఎన్‌టిఆర్‌ను అప్రజాస్వామికంగా పదవీచితుడిని చేసినప్పుడు...ఇలా అనేక సందర్భాల్లో చారిత్రాత్మక ఉద్యమాలు ఉద్భవించాయని గుర్తుచేశారు. సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా విస్తృత సమావేశం ఆదివారం నగరంలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు హరించి వేయబడుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసామ్య హక్కులను, ప్రజా ఉద్యమాలను రక్షించుకునేందుకు నవంబరు 7వ తేదీన 'ప్రజా రక్షణ భేరి' ద్వారా మరో చారిత్రాత్మక ఉద్యమానికి సిపిఎం సన్నద్ధమైందన్నారు. రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి చేస్తోందన్నారు. పదేళ్ల క్రితం పార్లమెంట్‌కు వచ్చిన మహిళా బిల్లును సమర్థించని బిజెపి...ఇప్పుడు దానిని ఆమోదించి తన గొప్పగా చెప్పుకుని లబ్ధిపొందాలని చూస్తోందన్నారు. విద్యుత్ సంస్కరణల అమలుకు రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తోందన్నారు. కేంద్రం వత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అనేక రూపాల్లో విద్యుత్ భారాలు మోపుతోందని విమర్శించారు. స్కిల్ స్కాం కేసులో బిజెపి సహకారం లేకుండా టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేసే పరిస్థితిలేదన్నారు. ఈ స్కాంపై ముందుగా ఉప్పందించిన బిజెపి...ఆ తర్వాత తమకు సంబంధంలేనట్లుగా నటిస్తోందన్నారు. 2021లోనే నమోదైన ఈ కేసులో అధికారులను అరెస్టు చేసి విచారించినప్పుడే చంద్రబాబు తప్పని నోరు మెదిపి ఉంటే ఇప్పుడు పరిస్థితి తనదాకా వచ్చేదికాదన్నారు.
నవంబరు 7న బహిరంగ సభకు జనసమీకరణ
ఈ సమావేశంలో సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ మాట్లాడుతూ నవంబరు 7వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి బహిరంగ సభకు జనసమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకు ముందుగా అక్టోబర్ 28 నుండి 31వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ఏడు జాతాలు నిర్వహించాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న స్థానిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీదేవి, పివి.ఆంజనేయులు, ఎన్‌సిహెచ్.శ్రీనివాస్, బోయి సత్యబాబు, కోట కళ్యాణ్, ఎం.నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పలు తీర్మానాలు : స్థానిక ఎంబివికెలో ఆదివారం జరిగిన సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పలు తీర్మానాలు చేసింది. మిర్చి పంట తెగులు సమస్య పరిష్కరించాలి. నష్టపరిహారం చెల్లించాలి. సాగునీటి సమస్య వల్ల పంటలు వేయని భూములకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి. రైల్వే కాంట్రాక్టు కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవాలి.విజయవాడ సింగ్‌నగర్, గుణదల ప్లైఓవర్ బ్రిడ్జీలను వెంటనే నిర్మించాలి.విజయవాడలో కొండిపాంతాలలో నివసించేవారికి పట్టాలు ఇవ్వాలి.వినగడప వద్ద కట్లేరు మీద బ్రిడ్జి హైలెవల్ బ్రిడ్జ్ యుద్ద ప్రాతిపదికన నిర్మించాలి. కిడ్నీ సమస్య పరిష్కారానికి కష్ణా నది నీటిని కుళాయిల ద్వారా అందించాలి. కిడ్నీ బాధితులకు కొరకు హాస్పటల్ నిర్మించాలి. మందులు ఉచితంగా ఇవ్వాలి. క్రియాటిన్ 2 ఉన్న వారికి 5వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి.గ్రీన్‌టెక్ కంపెనీ తొలగించాలి. వెంటనే పని నిలుపుదల చేయాలి. అటవీభూముల సాగుదారులకు పట్టాలు ఇవ్వాలి. జిల్లాలో భూసమస్యలు పరిష్కరించాలి.వి.టి.పి.ఎస్. పొల్యూషన్ సమస్యను పరిష్కరించాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలి. ఉద్యమం చేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయులకు మద్ధతు. ప్రజాఉద్యమాలపై పోలీసుల నిర్భంధాన్ని నిలుపుదల చేయాలి. కేసులు ఉపసంహరించుకోవాలని సమావేశం తీర్మానించింది.