పూసపాటిరేగ: మూడుముళ్ల బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. సంసారనౌకలో ఆప్యాయంగా పయనించారు. అన్యోన్యంగా జీవించారు. కన్నబిడ్డలు ఐదుగుర్నీ కంటిపాపల్లా పెంచి పెద్ద చేశారు. ఇంతలో వృద్ధాప్యం వారిని పలకరించింది. గుండెపోటుతో భర్త మృతిచెందడంతో తట్టుకోలేక కొద్దిగంటల వ్యవధిలో భార్య కూడా తనువు చాలించింది. ఈ సంఘటన మండలంలోని ఎరుకొండ గ్రామంలో చోటుచేసుకుంది.
మండలంలోని ఎరుకొండ గ్రామానికి చెందిన బలగం నారాయణరావు (65) గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య బలగం సూర్యం (60) గురువారం రాత్రి 12 గంటల సమయంలో తుదిశ్వాస విడిచింది. వారికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ గంటల వ్యవధిలో మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.










