Sep 21,2023 23:45

సమావేశంలో మాట్లాడుతున్న యనియన్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లీశ్వరి

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : అంగన్వాడిల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లామని, నిరసనలు ధర్నాలు చేశామని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లేశ్వరి విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న చలో విజయవాడకు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో గురువారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కెపి మెటిల్డాదేవి అధ్యక్షత జరిగింది. మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే దిశగా చర్చలు జరపాలని, ఇప్పటికే ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చామని, చలో విజయవాడ ధర్నాకు సంబంధించి కూడా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని వివరించారు. అంగన్వాడీలు పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా రూ.వెయ్యి వేతనం ఇస్తామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత హామీని విస్మరించారని అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో సంబందిత శాఖ మంత్రి యూనియన్‌ నాయకులను చర్చలకు పిలుస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. యాప్‌ల పేరిట వేధింపులు తట్టుకోలేక అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. అంగన్వాడీ మహిళలలో ఒంటరి మహిళలు అధికంగా ఉన్నారని, వీరిపై కుటుంబ భారం ఉంటుందని ప్రభుత్వం గ్రహించాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలన్నారు. మెటిల్డాదేవి మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలకు చేసిందేమి లేదన్నారు. యాప్‌లు, ముఖ హాజరు పనులను అంగన్వాడీలు వ్యతిరేకించడం లేదని, పని విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు, 6 నెలల సెంటర్‌ అద్దెలు చెల్లించడంతోపాటు వేతనాలను సకాలంలో ఇవ్వాలన్నారు. జులైలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసనలో జాయింట్‌ కలెక్టర్‌ ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదన్నారు. రిజిస్టర్‌ పుస్తకాలు పంపిణీ, అర్హులకు ప్రమోషన్లు తమ పరిధిలోని అంశాలని, వాటిని పరిష్కారానికి కృషి చేస్తానని జాయింట్‌ కలెక్టర్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాణ్యత లేని ఫోన్లలో ఇంటర్నెట్‌ కనెక్ట్‌ అవక పని భారం పెరిగిందని, మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏళ్ల తరబడి సేవలు చేసి రిక్త హస్తాలతో ఇంటికి వెళుతున్నారని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ దక్కడం లేదని చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందితే మట్టి ఖర్చులు ఇవ్వాలని బతిమాలించుకోవాల్సి రావడం సిగ్గుచేట న్నారు. సెంటర్లలో చిన్నారుల ఆలనా పాలనా చూసే హెల్పెర్లకు అర్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలని, రాజకీయ జోక్యానికి తావివ్వొద్దని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదాక దశలవారీగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎఎల్‌ ప్రసన్న కుమారి, ఎం.కవిత, నిర్మల, మంగమ్మ, సుజాత, ఎ.పద్మ పాల్గొన్నారు.