
ప్రజాశక్తి - గుంటూరు సిటి : వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బులు వస్తున్న నేపథ్యంలో వాటిని ముందుగానే గుర్తించడంతోపాటు మెరుగైన వైద్యం అందించేందుకు ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్) కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.శ్రీకాంత్ కుమార్ చెప్పారు. ప్రతి మనిషీ రోజూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని, మరోవైపు శారీరక శ్రమకు దూరమవుతున్నాడని చెప్పారు. శరీరానికి వ్యాయామం లేకపోవడంతోపాటు, నిద్రలేమి, మారిన ఆహారపు అలవాట్లు, ఆహార పదార్థాల్లో కల్తీల కారణంగా గుండెకు పనిభారం పెరిగి తీవ్ర ఒత్తిడికి లోనవుతోందని తెలిపారు. ఇదే గుండె జబ్బులకు దారితీస్తోందని, అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా అనేక మంది అకాల మరణానికి గురవుతున్నారని వివరించారు. గుండె జబ్బులు గతంలో ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో సంబవించగా ప్రస్తుతం గ్రామాలకూ ఈ సమస్య విస్తరించిందని, ధూమపానం, మద్యపానం వంటివీ ఇందుకు కారణమని అన్నారు.
ఈ పరిణామాలు వైద్యులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయని, గుండె జబ్బులు మూడు దశాబ్దాలుగా సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని అన్నారు. గుంటూరు నగరంలో నిత్యం మరణిస్తున్న వారిలో 30 శాతం మందికి గుండె జబ్బులే ప్రధాన కారణమని రికార్డుల ద్వారా తెలుస్తోందని వెల్లడించారు. రోగి ఏ వ్యాధితో బాధపడుతున్నాడో ముందుగా తేలుసుకోలేకపోవడం, ఆ ఒత్తిడి గుండెపై తీవ్రంగా పడి మరణాలకు దారితీస్తోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత రోగాలతో బాధపడే వారిలో 60 శాతం మంది భారతీయులే ఉండడం అత్యంత బాధాకరమన్నారు. గుండె జబ్బులకు గురైన వారు ఆర్థికంగానూ తీవ్ర ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒక అంచనా ప్రకారం 2005-2022 మధ్యకాలంలో 237 బిలియన్ల డాలర్ల(రూ.11850 కోట్లు)ను భారతీయులు కార్డియో వాస్కులర్ కారణంగా నష్టపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు నిర్థారించాయన్నారు.
95 శాతం మంది గ్రహించలేకపోతున్నారు
మొదటిసారి వచ్చే గుండెపోటును 95 శాతం మంది గ్రహించలేకపోవడమూ ప్రాణాలను హరిస్తోందని డాక్టర్ శ్రీకాంత్‌కుమార్ అన్నారు. రెండోసారి వచ్చే గుండెపోటుతో సరైన సమయానికి ఆస్పత్రులకు వచ్చేలోపు చాలామంది మరణిస్తున్నారని చెప్పారు. గుండె నొప్పికి ముందు కొన్ని లక్షణాలు గమనించాలని, ఛాతి మధ్య భాగంలో నొప్పి (మంట), చెమటలు పట్టడం, భుజం నుంచి చెయ్యి వరకు నొప్పి, బొడ్డు దగ్గర నుండి మెడ వరకు వచ్చే నొప్పులను కచ్చితంగా అనుమానించాలని, గ్యాస్ అనుకోని అజాగ్రత్త చేయొద్దని డాక్టర్ శ్రీకాంత్‌కుమార్ సూచించారు. ఇలాంటి సమస్యలుంటే గుండె పోటుగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.
గుండె జబ్బులకు జిజిహెచ్‌లో అధునాతన వైద్యం
జిజిహెచ్‌లో వారానికి మూడుసార్లు గుండెకు సంబంధించిన వైద్య పరీక్షల కోసం వైద్యులు పాత భవనంలోని 10వ నంబర్ రూమ్‌లో అందుబాటులో ఉంటారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1300పైగా యాంజియోగ్రామ్, పేజ్ మేకర్, స్టంట్స్ వంటి ఆపరేషన్లు చేశారు. ఓపీ ద్వారా వచ్చే ప్రజల గుండె సమస్యలను ముందుగా గుర్తించేందుకు నెలలో 2000 పైగా 2డి ఎకో వైద్య పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తున్నారు.