Oct 20,2023 21:52

ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో బారులు తీరిన భారీ వాహనాలు

ప్రజాశక్తి - వీరఘట్టం :  మండల కేంద్రమైన వీరఘట్టంలోని అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద శుక్రవారం భారీ ట్యాంకర్‌ మరమ్మతులకు గురైంది. దీంతో ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు అంబేద్కర్‌ జంక్షన్‌ నుంచి నడుకూరు దాటి అటు అంబేద్కర్‌ జంక్షన్‌ నుండి చిదిమి జంక్షన్‌ వరకూ భారీ వాహనాలు కిలోమీటర్ల దూరంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఎంవి రమణ రంగంలోకి దిగి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లును అంబేద్కర్‌ జంక్షన్‌ నుండి ఇరిగేషన్‌ కార్యాలయం మీదుగా వట్టిగెడ్డ వంతెనకు, ఇటు పార్వతీపురం అటు పాలకొండ వెళ్లేందుకు వాహనాలను మళ్లించడంతో ప్రయాణికులు కొంతమేర ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. ప్రధాన రహదారికి ఇరువైపులా భారీ వాహనాలు నిలిచిపోవడం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నత్తతో పోటీపడుతున్న రహదారి పనులు
మేజర్‌ పంచాయతీ మెయిన్‌ రోడ్డు విస్తరణ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. ఒట్టిగెడ్డ నుండి స్వామి థియేటర్‌ వరకూ సుమారు 1.2 కిలోమీటర్‌ దూరం ఉపాధి హామీ నిధులు రూ.5.5 కోట్లతో చేపడుతున్నారు. ఈ మేరకు గతేడాది ఫిబ్రవరి 19న ప్రధాన రహదారి విస్తీర్ణం అభివృద్ధి పనులకు అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ శంకుస్థాపన చేసి వీరఘట్టం గ్రామాన్ని కేంద్ర బిందువుగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రధాన రహదారి విస్తీర్ణ అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించలేదు. ఈ పనులు నత్తతో పోటీపడుతున్నట్లు స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా భారీ వాహనాల రాకపోకల వల్ల ధుమ్మూ, ధూళి రేగిపోవడంతో రహదారికి ఇరువైపులా ఉన్న వర్తకులు, కూరగాయల వ్యాపారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రధాన రహదారి విస్తీర్ణ పనులు జరుగుతాయనడంతో ఎంతో సంబరపడ్డ మండల ప్రజలపై ఆశలపై నీళ్లు చల్లినట్లు అయిందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతో చరిత్ర, పేరు గల వీరఘట్టం నేడు సమస్యలతో సతమతమవుతుందంటే పాలకుల పనితీరు ఏవిధంగా ఉందో వీటిని చూస్తే అర్ధం చేసుకోవచ్చును. ఇప్పటికైనా పాలకులు ప్రధాన రహదారి విస్తీర్ణ అభివృద్ధి పనులపై దృష్టి సారించి రహదారి పనులు వేగవంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.