ప్రజాశక్తి - గుంటూరు : స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంటింటి సర్వేను బిఎల్‌ఓలు మరింత వేగంగా చేపట్టేలా సూపర్వైజరి అధికారులు పర్యవేక్షించాలని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పెద్ది రోజా ఆదేశించారు. ఈ అంశంపై గురువారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏఈఆర్‌ఓలు, సూపర్వైజరి అధికారులు, బిఎల్‌ఓలతో సమీక్షించారు. అదనపు కమిషనర్ మాట్లాడుతూ సర్వే వేగాన్ని పెంచాలని, బిఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్ల సర్వే చేయాలని చెప్పారు. సూపర్వైజరి అధికారులు ప్రతిరోజూ వారి పరిధిలో కొన్ని ప్రాంతాలకు క్షేత్రస్థాయి సర్వేలో పాల్గొనాలన్నారు. సర్వేలో అందే ఫారాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని అందుకు తగిన విధంగా అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. బిఎల్‌ఓలకు యాప్, లేదా ఫారాల దరఖాస్తుపై అనుమానాలు, సందేహాలు వస్తే సంప్రదించడానికి ఎన్నికల విభాగంలో సిబ్బందిని కేటాయించుకోవాలని, బదిలీలు, ఇతర కారణాలతో ఖాళీ అయిన బిఎల్‌ఓల స్థానంలో వెంటనే మరో కార్యదర్శికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్నికల విభాగ సూపరిండెంట్‌ను ఆదేశించారు. సర్వేలో వెనుకబడిన బిఎల్‌ఓలతో మాట్లాడి సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై చర్యలుకు సిఫార్సు చేయాలని సూపర్వైజరి అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏఈఆర్‌ఓలు (డిప్యూటీ కమిషనర్లు) బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకటకృష్ణయ్య, సిటీప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటీప్లానర్ కోటయ్య, ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మ, మేనేజర్ శివన్నారాయణ పాల్గొన్నారు.
సమీక్షలో మాట్లాడుతున్న అదనపు కమిషనర్ రోజా










