Nov 21,2021 07:14

సిఐటియు ఆలిండియా కౌన్సిల్‌ సమావేశాలు నవంబర్‌ 16-18 తేదీల్లో హైదరాబాద్‌లో జయప్రదంగా జరిగాయి. సమావేశంలో కోవిడ్‌ కాలంలో సిఐటియు కమిటీలు ప్రజలకు, కార్మికులకు అందించిన సేవలు, ఆ కాలంలోనే ఇబ్బందులు ఎదుర్కొన్న కార్మికుల సమస్యలపై పోరాటాలు, ఢిల్లీ రైతాంగ పోరాటానికి అందించిన మద్దతు తదితర అంశాలపై చర్చించింది. కష్టాల్లో ఉన్న వారికి సేవలు, సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఏక కాలంలో నిర్వహించిన చరిత్ర సిఐటియుది. కోవిడ్‌ కాలంలో బయటకు రావడానికే ప్రజానీకం భయపడుతున్న నేపథ్యంలో సిఐటియు కార్యకర్తలు కార్మికులను అంటిపెట్టుకుని ఉన్నారు. కార్మికులకు, ప్రజలకు అవసరమైన సహాయ, సహకారాలను సిఐటియు కమిటీలు అందించాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా, ప్రజల సంపదైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని ప్రతిఘటించాలని, ఐక్య పోరాటాలతో ప్రజా వ్యతిరేక మోడీ విధానాలను తిప్పికొట్టాలని కౌన్సిల్‌ సమావేశాలు తీర్మానించాయి.
రైతాంగ పోరాటానికి మరియు కార్మికవర్గం నిర్వహించిన సార్వత్రిక సమ్మె నవంబర్‌ 26కు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర కేంద్రం, జిల్లా కేంద్రాలతో పాటు క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని సమీకరించి నిరసనలు నిర్వహించాలని కౌన్సిల్‌ పిలుపునిచ్చింది. నవంబర్‌ 19న మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేస్తున్నట్లు, క్షమాపణలు కోరుతూ మోడీ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇది రైతాంగ పోరాట విజయం. రైతాంగ పోరాటానికి ఆర్థికంగా, భౌతికంగా మద్దతునిచ్చిన కార్మికులందరి విజయం. ప్రజా పోరాటాల విజయం. ఐక్య పోరాటం ద్వారా ప్రభుత్వ విధానాలను తిప్పి గొట్టగలమని మరోసారి రుజువయ్యింది. గత్యంతర లేక కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ నిర్ణయం చేసినప్పటికీ పార్లమెంట్‌లో ప్రకటించేంత వరకు మనం అప్రమత్తంగానే ఉండాలి.
సేవలు-పోరాటాలు
దాదాపు ఏడాదిన్నర సంవత్సరాల తరువాత భౌతికంగా జరిగిన కౌన్సిల్‌ సమావేశాలు ఉత్సాహపూరితంగా సాగాయి. కోవిడ్‌ నేపథ్యంలో కోవిడ్‌ బారిన పడిన వారికి, కార్మికులకు, వారి కుటుంబాలకు సిఐటియు రాష్ట్ర కమిటీలు అన్ని రూపాల్లో సహాయాన్ని అందించాయి. వైద్య శిబిరాలను, సలహా కేంద్రాలను, ఐసొలేషన్‌ కేంద్రాలను నిర్వహించాయి. వలస కార్మికులకు, కార్మికులకు, ప్రజలకు భోజనాలు, టిఫిన్లు, నిత్యావసర సరుకుల పంపిణీ, మాస్కులు, శానిటైజర్లు, నగదు తదితర రూపాల్లో సహాయాన్ని అందించాయి. ఆంధ్రప్రదేశ్‌ లోనే కార్మికుల సహాయంతో రూ. 2.7 కోట్లు విలువైన సహాయ కార్యక్రమాలను 1,60,000 మంది కార్మికులకు సిఐటియు అందించింది. సేవలందించడమేకాక, కష్టాలు ఎదుర్కొంటున్న కార్మిక వర్గానికి సిఐటియు అండగా నిలిచింది. యాజమాన్యాలు ఉపాధి నుండి తొలగించడం, వేతనాలు చెల్లించకపోవడం పైన, కేంద్రం లోని మోడీ ప్రభుత్వ కార్పొరేట్ల అనుకూల విధానాలకు వ్యతిరేకంగాను, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పైన పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. ఇతర కేంద్ర కార్మిక సంఘాలతో కలసి కార్మికులు, ప్రజల సమస్యలపై ఆందోళనలు, సమ్మెలు నిర్వహించింది. జులై 3, 2020న దేశవ్యాప్త ఆందోళనలు, 2020 నవంబర్‌ 26న 20 కోట్ల మందితో సమ్మె, నవంబర్‌ 26-27న కిసాన్‌ మార్చ్‌, జులై 22న ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణా దినం, సెప్టెంబర్‌ 23న దేశవ్యాప్త నిరసనలు, 2021లో జనవరి 7-8 తేదీల్లో నిరసనలు, అరెస్టులు కావడం, ఫిబ్రవరి 8న ప్రతిఘటనా దినం, జులై 23న ప్రైవేటీకరణ మరియు డిఫెన్స్‌ ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా, అక్టోబర్‌ 7న కేంద్ర ప్రభుత్వ ''నగదీకరణ'' విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసింది.
కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు రక్షణ పరికరాలు ఇవ్వాలని, ఇన్సెంటివ్‌లు చెల్లించాలని, మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించింది. వీటికితోడు రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణపై, బిజెపి విధానాలపై 2021 జూన్‌ 1-10 తేదీ వరకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టింది. జూన్‌ 10న దేశవ్యాప్త నిరసనోద్యమం నిర్వహించింది. స్కీమ్‌ వర్కర్ల సమస్యలపై సమ్మె చేసింది.
రైతాంగ పోరాటాలకు మద్దతుగా...
రైతులకు మద్దతుగా 2020లో మే 16న, మే 27న, జులై 23న, జులై 10న, సెప్టెంబర్‌ 23న, నవంబర్‌ 5న ఆందోళనలు నిర్వహించింది. డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌లో భాగస్వామ్యం వహించింది. 2021న ఫిబ్రవరి 18న రైల్‌రోకో, మే 26 బ్లాక్‌డే, జూన్‌ 26న ''వ్యవసాయాన్ని రక్షించండి - ప్రజాస్వామ్యాన్ని కాపాడండి'' కార్యక్రమం, ఆగస్టు 9న ''ఇండియాను రక్షించండి'', సెప్టెంబర్‌ 27న భారత్‌ బంద్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించింది.
రాష్ట్రంలో పోరాటాలు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం, విశాఖ స్టీల్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మె, మున్సిపల్‌ గ్రామ పంచాయితీ, బేవరేజ్‌, సివిల్‌ సప్లయి హమాలీల సమ్మెలు, ఆశాల సమ్మె ఆందోళనలు, గోపాల మిత్రల సమ్మె, విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మె, కాంట్రాక్టు నర్సుల సమ్మె, రైల్వే కాంట్రాక్టు కార్మికుల సమ్మెలు జరిగాయి. అంగన్‌వాడీలు నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా, మధ్యాహ్నభోజన కార్మికులు ఉపాధి కొనసాగింపు పై, విఓఏ, విఆర్‌ఏ, అర్బన్‌ హెల్త్‌, ఆయూష్‌ రంగాల్లో ఆందోళనలు చేపట్టారు. భవన నిర్మాణ రంగ కార్మికులు కోవిడ్‌ కాలంలో సంక్షేమ బోర్డు నుండి ఆర్థిక సహాయం అందించాలని, సంక్షేమ బోర్డు పథకాలను కొనసాగించాలని కోరుతూ వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ళ వద్ద పికిటింగ్‌లు చేశారు. ఆటో, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు కార్మికులు సమస్యలపై ఆందోళనలు చేపట్టారు. శ్రీకాకుళంలో అరబిందో కార్మికులు, రాజమండ్రి పేపర్‌ మిల్లు కాంట్రాక్టు కార్మికులు, ఆక్వా, ప్రకాశం పెరల్‌ కార్మికులు, కృష్ణపట్నం పోర్టు కార్మికులు, హిందూపురం గార్మెంట్‌ కార్మికుల సమ్మె, టిటిడిలో ఏడాదిగా ఆందోళనలు తదితర పోరాటాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
చర్చల్లో అన్ని రాష్ట్రాలు, ఫెడరేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో హైడల్‌ ప్రాజెక్టులో పని చేస్తున్న 600 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం అక్రమంగా తొలగిస్తే అక్కడ పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులందరూ వారికి మద్దతుగా ఆందోళనలు నిర్వహించడంతో వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. దేశవాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోరాటాలన్నింటిని కౌన్సిల్‌ సమావేశాలు సమీక్షించాయి. రాబోయే కాలంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించాయి.
దేశవ్యాప్త రెండు రోజుల సమ్మె
బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న దేశ వ్యతిరేక విధానాలపై, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్ర స్థాయి వరకు డిసెంబర్‌ 2021-జనవరి 2022 వరకు ప్రచారం నిర్వహించాలని...అన్ని కార్మిక సంఘాలతో కలసి సంయుక్త సమావేశాలు, జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర/జిల్లా/సెక్టార్‌ స్థాయిల్లో ఆందోళనలు, ర్యాలీలు, మహా పడావ్‌లు నిర్వహించాలని కౌన్సిల్‌ సమావేశం తీర్మానించింది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని, ''ప్రజలను రక్షించండి, దేశాన్ని కాపాడండి'' అన్న నినాదంతో కార్మిక సంఘాల జాతీయ సదస్సు ఇచ్చిన పిలుపులను జయప్రదం చేయాలని కూడా తీర్మానంలో పేర్కొంది.
కేంద్ర బిజెపి పభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, డిఫెన్స్‌, స్టీల్‌ప్లాంట్‌ తదితర రంగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్‌ తీర్మానించింది. పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్‌ ధరల పెంపుకు వ్యతిరేకంగా, నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా, మహిళలు, దళితులు, మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా, నగదీకరణ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలను, రోడ్లను, రైళ్ళను, గ్యాస్‌ పైపులను, ఎయిర్‌పోర్టులను, పోర్టులు, గోడౌన్లను కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 3 నుండి మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్టు కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా కౌన్సిల్‌ సమావేశాలు తీర్మానించాయి.
ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోవు కాలంలో రంగాల వారీ పోరాటాలను ఉధృతం చేయాలని కౌన్సిల్‌ సమావేశాలు తీర్మానించాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించబోయే బీడీ కార్మికుల, బ్యాంకు ఉద్యోగుల, స్టీల్‌ కార్మికుల, పోర్టు కార్మికుల, టెక్స్‌టైల్‌ పరిశ్రమల కార్మికుల, డిసెంబర్‌ 21న ఆయిల్‌ సెక్టార్‌ కార్మికుల సమ్మెలకు మద్దతు తెలిపింది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఐక్యంగా నిర్వహించబోయే రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కావాలని కౌన్సిల్‌ పిలుపునిచ్చింది. ''ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మనివ్వం-ఐక్య పోరాటాలతో కాపాడుకుందాం!'' ''కార్మికుల హక్కులను పరిరక్షించుకుందాం'' మరియు క్షేత్ర స్థాయిలో కార్మికవర్గాన్ని సంఘటితం చేయాలని కౌన్సిల్‌ సమావేశం నిర్దేశించింది.
                                                                  -  ఎ. వి. నాగేశ్వరరావు / వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర కోశాధికారి /