ప్రజాశక్తి-విజయనగరం : జగనన్న సురక్ష కార్యక్రామాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించి ఒపి సంఖ్యను భారీగా పెంచాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. శిబిరాల నిర్వహణ తరువాత, అవసరమైన వారికి తదుపరి వైద్యం అందేటట్లు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. క్యాంపులు, వచ్చిన రోగులు, నిర్వహించిన టెస్టులు, ఇచ్చిన మందుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ మండల అధికారులు, ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రతి ఇంటినీ తప్పనిసరిగా సర్వే చేయాలని, ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలను తెలుసుకొని, యాప్‌లో నమోదు చెయ్యాలని కలెక్టర్ సూచించారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ బిపి, షుగర్, హెచ్‌బి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్ భవనాల నిర్మాణంపై సమీక్షించారు. నవంబర్ 15 లోగా తుది దశలో ఉన్న భవనాలను పూర్తిచేసి ప్రారంభించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ట్రైనీ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, పలువురు జిల్లా అధికారులు, తాహశీల్దార్లు , ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.










