Apr 07,2021 07:04

   ఇప్పుడు ఈ స్క్రాప్‌ పాలసీ ఫలితంగా ఒకటి రెండు వాహనాలతో కుటుంబం పోషించుకుంటున్న వారిని తరిమివేసి... పెద్ద పెద్ద కంపెనీలకు రంగాన్ని ధారాదత్తం చేయదలచింది ప్రభుత్వం. స్క్రాప్‌ పాలసీ అసలు రహస్యం ఇదే. ఒకవైపు వాహన ఉత్పత్తి కంపెనీల లాభాలకు గ్యారంటీ ఇవ్వడం... రెండవ వైపు చిన్న యజమానులను తరిమివేసి పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించటం. ప్రభుత్వ విధానం వెనుక దాగి ఉన్న ఈ ప్రమాదాన్ని గమనించకుండా పర్యావరణం, ప్రజల ఆరోగ్యం, భద్రత వంటి ప్రభుత్వ మోసపూరిత ప్రకటనలకు బలికాకూడదు.
   పది పదిహేను సంవత్సరాలపాటు వాడిన మోటారు వాహనాలను స్క్రాప్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం తెగ ఉవ్విళ్లూరుతోంది. అందుకుగాను 'మోటారు వాహనాల చట్టం-1988' లోని నిబంధనలను సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం జి.ఎస్‌.ఆర్‌ 191(ఈ) ముసాయిదాను ఇటీవల (15.3.2021) విడుదల చేసింది. దీనిని అక్టోబర్‌ 1వ తేదీ నుండి అమలు చేయనున్నామని, ముప్పై రోజుల లోగా అభ్యంతరాలు తెలియజేయాలని అందులో పేర్కొంది. ద్విచక్ర, త్రి చక్ర, నాలుగు చక్రాల, మీడియం భారీ వాహనాలన్నిటికి ఇది వర్తిసుంది. అయితే రవాణా శాఖామాత్యులు దీనికి సంబంధించిన ప్రకటనను మార్చి 18వ తేదీన లోక్‌సభలో చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ తదుపరి కొద్ది వారాల్లో సంబంధిత ముసాయిదా విడుదల చేస్తామని చెప్పారు. పార్లమెంటులో ప్రకటనకు ముందే ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసి పార్లమెంటులో మాత్రం తదుపరి కొద్ది వారాల్లో ముసాయిదా విడుదల చేస్తామని చెప్పి మంత్రివర్యులు సభను పక్కదారి పట్టించారు. కాలుష్య తగ్గింపు, భద్రత ఈ పాలసీ ప్రధాన లక్ష్యాలుగా తెలియజేశారు. ఈ పాలసీ అమలుతో రూ.10,000 కోట్ల పెట్టుబడులు, 35,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పారు.
   ఇందులో చెప్పిన లక్ష్యాలు, కొత్త పెట్టుబడుల రాక, కొత్త ఉపాధి అవకాశాలు చూసినప్పుడు ఈ స్క్రాప్‌ పాలసీ చాలా మంచిది, తక్షణం తీసుకురావాలి అనిపిస్తుంది ఎవరికైనా. అయితే, ఈ పాలసీ లక్ష్యాలు నిజాయితీతో కూడినవా లేక వీటి వెనుక మరేదైనా మర్మం దాగి వున్నదా అనేదే ప్రధాన అంశం.
   పర్యావరణం, కాలుష్య నియంత్రణ, భద్రత ప్రధానమైతే తక్షణం దేశం లోని అన్ని ఆర్‌టిసి లను పటిష్టం చేసి, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా విస్తరించాలి. ఈ విషయాన్ని సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం ప్లానింగ్‌ కమిషన్‌కు అందజేసిన నివేదికలో చెప్పారు. నేటికీ అది జరగలేదు సరిగదా ఏకంగా ప్రణాళికా సంఘాన్నే రద్దు చేశారు. దాదాపుగా దేశంలోని ఆర్‌టిసి లు అన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడ్డాయి.
   ప్రజా రవాణాను విస్త్రుతపరచి, వ్యక్తిగత వాహన వినియోగాన్ని నియంత్రించడం కాలుష్య నియంత్రణలో మొదటి చర్యగా ఉండాలి. ప్రపంచం లోని అధిక దేశాల అనుభవం, ప్రధానంగా యూరోప్‌ అనుభం ఇదే. యూరోప్‌ లో ప్రజా రవాణాను ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించడంతో రవాణా చాలా ఖరీదైపోయింది.
   అభివృద్ధి పేర అడవులను నరికివేయడం, అక్రమ నిర్మాణాలను అనుమతించడం ఫలితంగా సుమారు 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో మూసీ నది పొంగి వరదలొచ్చిన విషయం మనకు తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తులను చూశాం. వీటిని మానవ కల్పిత విలయ తాండవాలుగా మీడియా ఘోషించింది. వాటిని వదిలి వాహన కాలుష్య నియంత్రణ, భద్రత గురించి మాట్లాడటం వెనుక పరమార్ధం మరేదో వుందనేది చెప్పకనే తెలుస్తుంది.

                                             స్క్రాప్‌ విధానాన్ని కొత్తగా కనిపెట్టారా ?

   ఉమ్మడి ఏపిఎస్‌ఆర్‌టిసి కాలం నుండి అనేక దశాబ్దాలుగా బస్సు తిరిగిన మైలేజ్‌ ఆధారంగా బస్సులను స్క్రాప్‌ చేసే విధానాన్ని అమలు చేస్తున్నాయి. దేశంలోని ఆర్‌టిసి లు అన్నీ బస్సు తిరిగిన మైలేజి లేదా దాని వయసును బట్టి పదిహేను సంవత్సరాల లోపే స్క్రాప్‌ చేస్తుంటాయి (ఆర్థిక సంక్షోభం కారణంగా గత కొంత కాలంగా దీని అమలు సక్రమంగా జరగడం లేదు). ప్రైవేట్‌ కమర్షిల్‌ వాహన యజమానులు కూడా వాహన కండిషన్‌ ఆధారంగా పదిహేను సంవత్సరాలకు ముందే మార్చి వేసి కొత్త వాహనం కొనేవారు. ఇందుకు రెండు ప్రధాన కారణాలు. వాహనం ఎక్కువ సంవత్సరాలు వాడితే ఐ.టి, దాని మెయింటెనెన్స్‌ చాలా ఖరీదు అవుతుంది. వాహనం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. 2) సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పుడు తదనుగుణంగా కొత్త పరిజ్ఞానాన్ని అమలు చేసుకోకపోతే మనుగడ సాధ్యం కాదు. వ్యక్తిగత వాహనాలు వున్నవారు కూడా ఇదే పాటిస్తారు. అందుచేత ప్రభుత్వం ఇప్పుడే కొత్త విధానాన్ని కనిపెట్టలేదనేది యథార్ధం.

                                                 అసలు సమస్య ఎక్కడుంది ?

   కరోనాకు ముందే ఆర్థిక మాంద్యం లోకి మన దేశ ఆర్థిక వ్యవస్థ నెట్టబడింది. ప్రజల దగ్గర డబ్బులు లేక కొనుగోలు శక్తి తగ్గింది. ఉత్పత్తి రంగం తిరోగమనం వైపు నెట్టబడింది. ప్రధానంగా ఆటోమొబైల్‌ రంగం. అనేక కంపెనీలు ఉత్పత్తిని తగ్గించి, కార్మికులను ఇంటికి పంపారు. కరోనా ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. కోవిడ్‌ కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రజలపై భారాలు మోపి ఖజానా నింపుకుంది. 2020 మార్చి-జూన్‌ నెలల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం డీజిల్‌ మీద లీటరుకు రూ.16, పెట్రోల్‌ మీద రూ.13 ఎక్సయిజ్‌ డ్యూటీ పెంచి రూ.2 లక్షల 94 వేల కోట్లు ఖజానాలో జమ చేసుకుంది (భారీగా ఉద్దీపన ప్యాకేజి ఇచ్చామని చెప్పిన దాంట్లో వాస్తవానికి నగదు రూపంలో ఖర్చు చేసింది రూ.2 లక్షల కోట్ల లోపేనని పలువురు ఆర్థికవేత్తలు బైటపెట్టారు). వరుసగా పెరుగుతున్న డీజిల్‌ ధరలు, టోల్‌టాక్స్‌ భారాలు, ఇతర పన్నులు కలసి రవాణా రంగాన్ని కోలుకోలేని విధంగా కుంగదీశాయి. ఫలితంగా కొత్త వాహన అమ్మకాలు మందగించి ఉత్పత్తి సంస్థల లాభాలు తగ్గాయి. కొంతమేర నిల్వలు కూడా పేరుకుపోయాయి. ఈ స్థితిలో వాహన ఉత్పత్తి సంస్థలను ఆదుకోవాలి. స్క్రాప్‌ పాలసీ రూపకల్పనలో ఇదొక ప్రధాన అంశం.

                                             స్క్రాప్‌ పాలసీ అసలు రహస్యం

   చిన్న యజమానులను గెంటివేయడం...బడా కార్పొరేట్‌ సంస్థలకు రవాణా రంగాన్ని అప్పగించడం...2019లో ఆమోదింపజేసుకున్న మోటారు వాహన చట్ట సవరణ లక్ష్యం ఇదే. గతంలో లేని ''అగ్రిగేటర్‌'' ను కొత్తగా చేర్చడమే ఆ సవరణ ప్రధాన లక్ష్యం. అగ్రిగేటర్‌ అంటే ప్రయాణికుడిని-డ్రైవర్‌ను అనుసంధానం చేసే ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫారమ్‌ (ఊబర్‌, ఓలా ఇంకా అనేక సంస్థలు సరకు రవాణాలో ఇటీవల వచ్చాయి). ఇప్పుడు ఈ స్క్రాప్‌ పాలసీ ఫలితంగా ఒకటి రెండు వాహనాలతో కుటుంబం పోషించుకుంటున్నవారిని తరిమివేసి పెద్ద పెద్ద కంపెనీలకు రంగాన్ని ధారాదత్తం చేయదలచింది ప్రభుత్వం. స్క్రాప్‌ పాలసీ అసలు రహస్యం ఇదే. ఒకవైపు వాహన ఉత్పత్తి కంపెనీల లాభాలకు గ్యారంటీ ఇవ్వడం...రెండవ వైపు చిన్న యజమానులను తరిమివేసి పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించటం. ప్రభుత్వ విధానం వెనుక దాగి ఉన్న ఈ ప్రమాదాన్ని గమనించకుండా పర్యావరణం, ప్రజల ఆరోగ్యం, భద్రత వంటి ప్రభుత్వ మోసపూరిత ప్రకటనలకు బలికాకూడదు.
ఇక కొత్త పెట్టుబడులు, 35 వేల మందికి కొత్తగా ఉపాధి కల్పన ఎండమావిలో నీరు వంటిదే. ప్రస్తుతం ఉన్న కంపెనీలు పూర్తి సామర్ధ్యం మేరకు ఉత్పత్తి చేయగలిగితే అదే గొప్ప. కరోనాకు ముందే ఆటోమొబైల్‌ రంగ మాంద్యం కారణంగా 5 లక్షల మంది కార్మికులు తొలగించబడ్డారు. బహుశా అందులో కొందరికి తిరిగి ఉపాధి లభించవచ్చు తప్ప కొత్త ఉపాధి రాదు.
   వ్యవసాయ చట్టాల సందర్భంగా కూడా ప్రభుత్వం ఎలాంటి మోసపూరిత వాదనలు ముందుకు తెచ్చిందో మనం చూశాం. రైతుల సమైక్య ఆందోళన ఈ అంశాలను బట్టబయలు చేసింది. కార్మిక చట్టాల స్థానంలో లేబర్‌ కోడ్‌లు రూపొందించినప్పుడు కూడా కార్మికుల ప్రయోజనం కోసమేనని నమ్మించడానికి ప్రభుత్వం నానా తంటాలు పడింది. ఉన్నత విద్యకు పేదలను దూరం చేసే నూతన విద్యా విధానం కూడా ఈ కోవ లోనిదే. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనం దాగివుందో తెలుసుకోకపోతే మోసపోతాం అన్న మార్క్స్‌ మహనీయుడు మాట నేటి ప్రభుత్వ కపట నాటకాలకు చక్కగా వర్తిస్తుంది.
  కాలుష్య నియంత్రణ, ప్రజల ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ వుంటే కింది చర్యలు చేపట్టాలి.
   స్క్రాప్‌ స్వచ్ఛందం చేయాలి. తప్పనిసరి విధానం చేయకూడదు.
   ఆర్‌టిసి లను పటిష్టం చేసి ప్రజావసరాలకు అనుగుణంగా విస్తరించాలి. వ్యక్తిగత వాహన వినియోగాన్ని నియంత్రించాలి.
  పాత వాహనాల స్థానంలో కొత్త వాహనం తీసుకునేప్పుడు దాని ఖరీదులో ఒక భాగం ప్రభుత్వ సబ్సిడీ, ఒక భాగం కంపెనీలు డిస్కౌంట్‌ ఇవ్వాలి. మూడవ భాగం వాహనదారుడు భరించడానికి ప్రభుత్వం బ్యాంక్‌ ద్వారా రుణ సదుపాయం కల్పించాలి.
   ముసాయిదా పాలసీపై అభ్యంతరాలు తెలియచేసే గడువును 30 రోజుల నుండి కనీసం 180 రోజులకు పెంచాలి.
   ముసాయిదాపై సంబంధిత వర్గాల వారితో వివిధ స్థాయిల్లో విస్త్రుతంగా చర్చించాలి.


/ వ్యాసకర్త ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి /
ఆర్‌. లక్ష్మయ్య

ఆర్‌. లక్ష్మయ్య