Aug 18,2023 20:46

నాగేశ్వరరావు మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబీకులు

ప్రజాశక్తి - వినుకొండ : మోటారును బాగు చేయించుకొస్తానని వెళ్లిన వ్యక్తి మృతి చెందాడనే కబురు ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచింది. ఆర్టీసీ బస్సు ఢకొీని రైతు దుర్మరణం పాలైన ఘటన మండలంలోని చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద శుక్రవారం జరిగింది. వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం పాతనాగిరెడ్డిపల్లికి చెందిన గోగ నాగేశ్వరరావు (46) అదే గ్రామానికి చెందిన నాదెండ్ల మోహన్‌రావుతో కలిసి వ్యవసాయ మోటారు మరమ్మతు కోసం ద్విచక్ర వాహనంపై వినుకొండకు వస్తున్నారు. చీకటిగలపాలెం అడ్డరోడ్డు రైల్వే ఫై ఓవర్‌ బ్రిడ్జి వద్దకు రాగానే వీరి వాహనాన్ని ఎర్రగొండపాలెం వైపు వెళ్తున్న వినుకొండ ఆర్టీసీ డీపోకు చెందిన బస్సు ఎదురుగా ఢ కొట్టింది. నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మోహన్‌రావును 108లో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం నరసరావుపేటకు తరలించారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో వాహనాన్ని బస్సు ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో ప్రమాదం వాటిల్లినట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.