Aug 28,2023 00:19

మోటారు చోరీకి గురైన ప్రాంతం

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : ఒకే రోజు, ఒకే ప్రాంతంలో 5 వ్యవసాయ మోటార్లను దుండగలు శనివారంరాత్రి అపహరించారు. ఇలా మోటార్లు చోరీకి గురికావడం గత మూణ్ణెల్లలో ఇది రెండోసారి. కుంచనపల్లి పొలాల్లో విద్యుత్‌ మోటర్లు వరుసగా చోరీకి గురవడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన అమ్మిశెట్టి సుబ్బారావు, బొడ్డు ప్రసాద్‌, అమ్మిశెట్టి శివనాగేశ్వరరావు, అమ్మిశెట్టి అర్జున్‌, కుక్కమల్ల శామ్యూల్‌ అనే రైతుల పొలాల్లోని మోటార్లు అపహరణకు గురయ్యాయి. ఆదివారం ఉదయం గమనించిన రైతులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో మోటారు ఖరీదు రూ.50 వేలకు పైబడే ఉంటుందని రైతులు వాపోతున్నారు. అసలే వ్యవసాయ పెట్టుబడులు పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్న తమకు వ్యవసాయ విద్యుత్‌ మోటర్లు మళ్లీ కొనుక్కునే ఆర్థిక స్తోమత లేదని ఆవేదన చెందుతున్నారు. విద్యుత్‌ మోటర్ల చోరీ విషయం తెలుసుకున్న సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉన్న రైతులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతుల వ్యవసాయ విద్యుత్‌ మోటర్లు అపహరణకు గురికావడం బాధాకరమన్నారు. పంటలకు సరైన సమయంలో నీరు అందించకపోతే పైర్లు ఎండిపోయి, రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. పెనుమాక గ్రామ పరిసర ప్రాంతాల్లో 20 మోటార్లు అపహరణకు గురయ్యాయని, పోలీసులు సత్వరమే స్పందించి చోరీలకు అడ్డుకట్ట వేయాలని సిఐ శేషగిరిరావును కోరారు.