Apr 17,2023 00:17

మాట్లాడుతున్న నన్నపనేని శివాజీ

ప్రజాశక్తి-గుంటూరు:మోటారు వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని 15 ఏళ్లు దాటిన వాహనాలు తీసివేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జరిగే పోరాటాలలో రవాణా రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేని శివాజీ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నగర సమావేశం వేముల శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ మోటారు వెహికల్‌ సవరణ చట్టం-2019ని కేంద్రంలో ప్రభుత్వ ఆమోదించాక, రాష్ట్రంలో జీవో నెంబర్‌ 21 ద్వారా అన్ని రకాల చలానాలు జరిమానాలు పెంచి, రవాణా రంగాన్ని ప్రభుత్వం ఆదాయంగా భావించి సంక్షోభంలోకి నెట్టాయని విమర్శించారు. గ్రీన్‌ ట్యాక్స్‌ విపరీతంగా పెంచడం, ఇన్సూరెన్స్‌ రోడ్డు టాక్స్‌, టోల్గేట్‌ 15శాతం పెంచడం గుదిబండగా మారాయని అన్నారు. రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రవాణా రంగంపై నూతనంగా 30శాతం రోడ్‌టాక్స్‌ పెంచడం ఈ రంగాన్ని మరింత దెబ్బతీయటమేనని అన్నారు. ఎప్పటికీ టోల్‌ట్యాక్సు, రోడ్డు ట్యాక్సు, అధిక పెనాల్టీలు గ్రీన్‌ టాక్స్‌ మోటర్‌ వాహనచట్ట సవరణ ఫైన్లతో బాడుగలు లేక, కిస్తీలు చెల్లించలేక సంక్షోభంలో కూరుకు పోతుందన్నారు. అలాగే ఉన్న రవాణా రంగంపై 15 ఏళ్లు దాటిన వాహనాలు తీసివేయాలని కేంద్రం నిర్ణయం వల్ల దేశంలో కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ను జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రవాణా రంగ కార్మికులతో పాటు ఇతర అన్ని రంగాల కార్మికులను కలుపుకొని భవిష్యత్తులో ఐక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు నగర కార్యదర్శి బి.ముత్యాలరావు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్‌కె. మస్తాన్‌ వలి, నగర ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ కార్యదర్శి గండికోట శంకర్‌ తదితరులు మాట్లాడారు. అనంతరం హిందూ కళాశాల వద్ద ఉన్న ఆటో స్టాండ్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన గౌరవాధ్యక్షులుగా అంకాల వెంకటేశ్వర్లు, అధ్యక్షులు కారసాల ఏడుకొండలు, ప్రధాన కార్యదర్శి కూరగంటి సంపత్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు పల్లెపాగు సాల్మన్‌, సహాయ కార్యదర్శి గుంజి కొండలరావు, కోశాధికారి బత్తుల విజరు, కమిటీ సభ్యులు బి రాజేష్‌ ఓ శ్రీను, జి.పవన్‌, ఎస్‌కె.మస్తాన్వలి, ఎం అర్జున్‌రావు తదితరులను ఎన్నుకున్నారు.