మోసపూరిత ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో డబ్బు పెట్టకండి
సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దు
జిల్లా ఎస్‌పి కె. రఘువీర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
మోసపూరిత ఆన్‌లైన్ ట్రేడింగ్లో డబ్బులు పెట్టి, సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దని జిల్లా ఎస్‌పి కె.రఘువీర్ రెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం సైబర్ నేరాలపై జిల్లా ఎస్‌పి తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ వివరాలు ఇవ్వండి అని ఫోన్ వస్తే మీరు ఆశపడి ఆకర్షితులైతే సైబర్ నేరగాళ్ల చేతిలో నిలువుదోపిడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. మోసపూరిత ఆన్‌లైన్ ట్రేడింగ్లో డబ్బులు పెట్టి మోసపోవద్దన్నారు. డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడటం మంచిదన్నారు. సైబర్ మోసం జరిగిన వెంటనే నంద్యాల సైబర్ ల్యాబ్‌కు లేదా 1930కి కాల్ చేస్తే మోసపూరిత డబ్బు సైబర్ నేరగాళ్ల చేతికి పోకుండా ఫ్రీజ్ చేయవచ్చనని లేదా ఎన్‌సిఆర్‌పి పోర్టల్ (షషష.షybవతీషతీఱఎవ.స్త్రశీఙ.ఱఅ)లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని చెప్పారు. బ్యాంక్ అక్కౌంట్ నెంబర్‌ను ఒటిపి (ఒన్ టైమ్ పాస్వర్డ్)ను, బ్యాంక్ పిన్ నెంబర్‌ను, సిసివి నెంబర్‌ను ఎవరితోనూ పంచుకోరాదన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి లావాదేవీ వివిధ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా జరుగుతున్నాయని, కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సున్నితమైన విషయాలను ఓటీపీ, పాస్వర్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, సిసివి నంబర్స్, తెలియని వ్యక్తుల నుండి మెసేజ్‌లలో, మెయిల్స్‌లో వచ్చిన తెలియని లింకులపై, సామాజిక మాధ్యమాలలో వచ్చే లింక్స్‌ని క్లిక్ చేసి మోసపోవద్దని సూచించారు. నిబంధనలు పాటిస్తూ సైబర్ నేరాలపై జాగ్రతగా ఉండాలని జిల్లా ప్రజలకు తెలిపారు.










