మోసపోయాం.. న్యాయం చేయండి..
- పలువురు బాధితులు జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
వ్యక్తిగత బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని ఒకరు, పనులు చేసుకోవడానికి జెసిబి ఇప్పిస్తానని మరొకరు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇంకొందరు నమ్మబలికి సొమ్ము తీసుకొని మోసం చేశారని, వారి నుండి తమకు న్యాయం చేయాలని పలువురు బాధితులు జిల్లా ఎస్‌పి కె.రఘువీర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సోమవారం బొమ్మల సత్రం దగ్గర ఉన్న జిల్లా ఎస్‌పి కార్యాలయంలో పోలీసు స్పందన నిర్వహించారు. స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. ప్రతి సోమవారం ప్రతి పోలీసు స్టేషన్, సర్కిల్ ఆఫీసు, డిఎస్‌పి ఆఫీసులలో స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా పోలీసు కార్యాలయానికి సంబందిత సమాచారం అందించాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదిదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలతో జిల్లా పోలీస్ కార్యాలయానికి రాకుండా తమ ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా గానీ, ఫోన్ నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం 9154987020 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌పి తెలిపారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
- 'మా చిన్నాన్న బాలగంగాధర్ రెడ్డితో కలిసి నంద్యాల పట్టణం బొమ్మలసత్రానికి చెందిన తెల్లాకుల మద్దిలేటి, తెల్లాకుల సన్నన్న కలిసి నా తండ్రి సంతకాలతో ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. న్యాయం చేయండి' అంటూ భూపనపాడు గ్రామానికి చెందిన సిద్ధం సురేష్ ఫిర్యాదు చేశారు.
- 'ఇండియన్ బుల్స్ కంపెనీ మాది బెంగళూరు, హైదరాబాదులో ఆఫీసులో ఉన్నాయని, పర్సనల్ లోను 5 లక్షల దాకా ఇస్తామని,లోన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులకు పలు దఫాలుగా 67 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపాను. ఇంత వరకు లోన్ ఇవ్వకుండా ఇంకా రూ.37 వేలు ఇస్తేనే లోన్ ఇస్తామని మోసం చేస్తున్నారు' అని నందివర్గం గ్రామానికి చెందిన ఎస్ .వెంకటరమణ విన్నవించాడు.
- 'పనుల కోసం జెసిబి ప్రోక్లైన్లు ఇప్పిస్తానని పలుకూరు గ్రామానికి చెందిన టి.రామకృష్ణ రూ.50 వేలు డబ్బులు తీసుకొని జెసిబిలు పంపకుండా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు' అని గోరుకల్లు గ్రామానికి చెందిన రామ్మోహన్ ఎస్‌పికి ఫిర్యాదు చేశారు.










