ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
'ఒక్కఛాన్స్' పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన మోసకారి జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు క్షమించరని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం టిడిపిదేనని టిడిపి నేతలు పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కోట్ల క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించారని విమర్శించారు. మహానాడు వేదికగా టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన 'ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ' మేనిఫెస్టోతో జగన్ సర్కారులో వణుకు పుట్టిందని తెలిపారు. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచిన ఘనత జగన్‌దేనన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు 'షాక్' ఇచ్చిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే 'షాక్' ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జె బ్రాండ్ మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఎన్‌టిఆర్, కోట్ల విజయభాస్కర రెడ్డి, చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రభుత్వ పక్కా గృహాలకు వన్ టైం సెటిల్‌మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేసి రూ.4500 కోట్లు దోపిడీ చేసి పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుకున్నారని దుయ్యపట్టారు. టిడిపి నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, టిడిపి కురువ సాధికారిక కమిటీ జిల్లా సభ్యులు అడ్వకేట్ కెటి.మల్లికార్జున, రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, మండలం మాజీ ఆత్మ ఛైర్మన్ కందనాతి శ్రీనివాసులు, టిడిపి మైనార్టీ నాయకులు కెఎమ్‌డి.అబ్దుల్ జబ్బార్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న టిడిపి నాయకులు










