ప్రజాశక్తి - ఆదోని
విత్తన వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని టిడిపి ఆదోని మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె కృష్ణమ్మ, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్, టిడిపి సీనియర్ నాయకులు సూరం భాస్కర్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప విమర్శించారు. సోమవారం పట్టణంలోని సిటీ ప్రెస్ కాంపౌండ్‌లో ఉన్న వారి కార్యాలయంలో ఎల్‌ఎల్‌సి మాజీ ఛైర్మన్ బసాపురం రామస్వామి, ఆత్మ మాజీ ఛైర్మన్ ఫక్రుద్దీన్‌తో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో నాణ్యత లేని పత్తి విత్తనాలు సాగు చేసి వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. పంట ఏపుగా పెరిగినా పూత, కాయలు లేక పంట ఎకరాకు కేవలం రెండు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందన్నారు. కొనుగోలు సమయంలో బిల్లు, రషీదు, ప్యాకెట్ ఇతర రుజువులు చూపినప్పటికీ డీలర్లు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని తెలిపారు. బసాపురం, చిన్నహరివాణం, పెద్దహరివాణం, సంతేకుడ్లూరు, హానవాలు రైతులకు జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. పంటను వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించినా పరిహారం మంజూరు కాలేదన్నారు. రూ.850 ఎంఆర్‌పి ధర ఉన్న పత్తి విత్తన ప్యాకెట్లను వ్యాపారులు రూ.1200 నుంచి 1500 వరకు కంపెనీ డిమాండ్‌ను బట్టి విక్రయిస్తున్నారని తెలిపారు. జాదు, సైరా, అకిరా కంపెనీల పేరుతో రైతులను దగా చేస్తున్నారన్నారు. రైతులు మోసానికి గురవుతున్నా పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదన్నారు. పత్తి, మిరప విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ధరలను అమాంతంగా పెంచి వ్యాపారులు లాభపడుతున్నారని తెలిపారు. విత్తన స్టాక్ వివరాలను డీలర్లు బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అగ్రికల్చర్ ఉద్యోగులను విత్తన దుకాణాల వద్ద నిఘా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పట్టాదారు పాసు పుస్తకానికి విస్తీర్ణాన్ని బట్టి కావాల్సిన విత్తనాలను ఎంఆర్‌పి ధరకు అందేలా చూడాలన్నారు. సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నాయకులు విఎం.గోపాల్, మల్లేశప్ప, సోమశేఖర్ రెడ్డి, రాముడు, కారుమంచప్ప, షేక్షావలీ ఉన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు










