ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఖాళీ సమయాలలో పనిచేసి అదనపు ఆదాయం ఆర్జించమంటూ, పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల గురించి వివరించారు. 'ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయాలలో పనిచేస్తూ అదనంగా డబ్బు సంపాదించండి.. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు అదనపు ఆదాయం సంపాదించవచ్చు' వంటి ఆకట్టుకునే విధంగా ప్రకటనలు కుమ్మరించడంతో ఆర్థిక కష్టాలు కొంతైనా తీరతాయని నమ్మి జాబ్ పోర్టల్స్‌లో నిరుద్యోగులు రెజ్యూమ్‌లు అప్‌లోడ్ చేస్తుంటారని, ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులు జాబ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేసిన రెజ్యూమ్‌ల నుంచి వివరాలను సేకరించి నిరుద్యోగులకు తరచూ ఫోన్‌లు చేస్తూ సంభాషణలు కొనసాగిస్తారని, రిజిస్ట్రేషన్ పేరిటగానీ లేక మరేదైనా కారణం చెప్పి తమ వ్యక్తిగత ఖాతాలో డబ్బులు జమ చేయమని కోరుతారని, అలా జమచేసిన వారు డబ్బు కోల్పోతారని తెలిపారు. కాబట్టి ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సంస్థలు జీతాలు ఇచ్చి నియమించుకుంటాయి కానీ డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వవు అనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఆఫర్ లెటర్‌లో కంపెనీల లోగోలు, లెటర్ హెడ్స్ తదితర వివరాలను ధ్రువీకరించుకోవాలని, అపరిచితులకు డబ్బులు బదిలీచేసే ముందు తార్కికంగా ఆలోచించాలని హెచ్చరించారు. బ్యాంక్ అకౌంట్స్, టాక్స్ ఫామ్స్, పాన్ నెంబర్, ఆధార్ కార్డ్ లాంటివాటిని అడుగుతున్నారంటే అనుమానించాలని తెలిపారు. కంపెనీలు అధికారిక వెబ్‌సైట్లలోనే ఉద్యోగ ఖాళీల వివరాలను, అవసరాలను పొందుపరుస్తున్నాయన్నారు. కాబట్టి ఇలాంటి నమ్మదగ్గ మార్గాలలో ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తే మోసపోవడానికి ఆస్కారం ఉండదని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇలాంటి పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఈ తరహా మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, లేదా సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని ఎస్పీ తెలియజేశారు.










